అమరావతి: ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్‌కు 40 కిలోమీటర్లు, చాంద్‌బలికి 50 కిలోమీటర్లు, అలాగే పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆయన తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ చాంద్‌బలి-దిఘా మధ్య బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటిందని తెలిపారు. తీరం దాటిన అనంతరం తదుపరి 24 గంటల్లో ఇది ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా ముందుకు కదిలే వీలుందని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికఈ వాయుగుండం ప్రభావంతో సోమవారం (జులై 6న) ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటితో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే వీలుందని పేర్కొంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున రెండు రోజులపాటు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: KTR On Polavaram Project: దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్తెలంగాణ వర్షాలు, వాతావరణ అప్‌డేట్.. తగ్గనున్న వర్షాలు
గడిచిన 3 రోజులుగా అల్పపీడనం (LPA) కారణంగా మంచి వర్షాలు కురిసిన తర్వాత, తెలంగాణలోని చాలా ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. కొన్ని జిల్లాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. మధ్య, తూర్పు, పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాలైన సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో రోజంతా చాలా వరకు పొడిగా ఉంటుంది, సాయంత్రం తరువాత కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు..
