తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి మర్ధబల్ నుండి తూర్పున బంగాళాఖాతం మీదుగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కేంద్రీకృతమై... ఉపరితల ఆవర్తనం 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లోని ఒక్కటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలోనూ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాలు, పెనుగాలల వల్ల అత్యవసర సేవలకు, జనజీవనానికి ఎటువంటి అవాంతరాలు కలుగకుండా నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని రక్షణ, సహాయక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఎక్కువ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.