Railway Minister Ashwini Vaishnav Comments On Telugu States Railway Projects: రైల్వే శాఖ ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) కీలక ప్రకటన చేశారు. ఏపీలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామని తెలిపారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువని చెప్పారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో మొత్తం రూ.84,559 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నడుస్తున్నాయని.. రాష్ట్రంలో కొత్తగా 1,560 కి.మీల రైల్వే ట్రాక్స్ వేశామన్నారు. రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్తుస్తున్నామని.. ఈ స్టేషన్ల ఆధునికీకరణకు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. 'ఏపీకి మరిన్ని నమో భారత్, వందేభారత్ రైళ్లు కేటాయించాం. రైళ్ల వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆధునిక సాంకేతికత సాయంతో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందేభారత్ రైళ్లు తిరుగుతున్నాయి. అన్ని రైళ్లు 110 కి.మీ వేగంతో వెళ్లేలా ట్రాక్స్ సిద్ధం చేస్తున్నాం.' అని స్పష్టం చేశారు. ఈ కారణాల వల్లే ఏపీ రైల్వే ప్రాజెక్టుల గురించి బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని పేర్కొన్నారు.

'తెలంగాణకు అన్యాయం జరగలేదు'

రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు (Telangana) అన్యాయం జరిగిందన్న విమర్శలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) స్పందించారు. తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదని.. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని చెప్పారు. 'ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో 1,326 కి.మీ మేర ప్రస్తుతం కవచ్ టెక్నాలజీ ఉంది. మరో 1,026 కి.మీ మేర ఈ టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నాం. 2026లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తాం. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తాం.

ఇటీవల స్విట్జర్లాండ్ వెళ్లి అక్కడ రైల్వే ట్రాక్‌లను పరిశీలించాం. రైల్వే ట్రాక్స్ నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను పాటిస్తున్నాం. వందే భారత్ రైళ్లల్లో స్లీపింగ్ సీట్లపై ట్రయల్ జరుగుతోంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని రైల్వే లైన్ల విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. పేద వర్గాల కోసమే నమో భారత్ రైళ్లు నడుపుతున్నాం. త్వరలో దేశమంతా దాదాపు 100 నమో భారత్ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఈ రైళ్ల ద్వారా పేద ప్రజలకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది.' అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

Also Read: Vishnu Meets AP CM: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గాలి - చంద్రబాబుకు విష్ణువర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు