Duddukunta: ఉమ్మడి అనంతపురం(Anathapur) జిల్లా వైసీపీ(YCP)లో వర్గపోరు రోజురోజు రాజుకుంటోంది. ఫలానా వాళ్లదే టిక్కెట్ అన్న గ్యారెంటీ లేకపోవడంతో ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకోవడమేగాక..ఎదుటివారిని చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థుల కన్నా సొంతపార్టీ నేతలతోనే ఎక్కువ నష్టం జరుగుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాపోతున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.


విషప్రచారం 
రాయలసీమలో ఉన్నా ప్రశాంతనిలయం ఉన్న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి(Puttaparthi) రాజకీయపరంగా ప్రశాంతతకు మారుపేరుగా ఉంది. కానీ ఇప్పుడు అక్కడ విగ్రహాలు ధ్వంసం చేసుకునే విషసంస్కృతి పాకింది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సమీపంలో ఉన్న వైసీపీ నేత లోచర్ల(Locharla) విజయ్ భాస్కర్ రెడ్డి తండ్రి పెద్దారెడ్డి పెద్దారెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. అయితే ఈ పని చేసింది ఎమ్మెల్యే దుద్దుకుంట(Duddukunta)శ్రీధర్ రెడ్డి వర్గీయులేనని విజయ్ భాస్కరెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లోచర్ల వైసీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మరోసారి దుద్దుకుంటకు టిక్కెట్ ఇస్తే తామంతా సహకరించేది లేదని తీర్మానించారు. దీనిపై కక్షగట్టి ఎమ్మెల్యే వర్గం విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు.
ఆ సంస్కృతి నాకు లేదు
అయితే విగ్రహాలను ధ్వంసం చేసే సంస్కృతి తనకు లేదని...ఈ విషయం నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అన్నారు. కావాలనే తనపై సొంతపార్టీ నేతలే దుష్ప్రాచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  అధిష్టానం ఆదేశానుసారమే నియోజకవర్గంలో పదవులు పంపకాలు చేశానని అది ఓర్చుకోలేని కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను ఇటీవల నారా లోకేష్(Lokesh) ను కలిసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పుట్టపర్తిలో పెద్దారెడ్డి కాలనీలో లోచర్ల విజయభాస్కర్ రెడ్డికి తండ్రి పెద్దారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయించుకోవడం చేతకాకపోతే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయించేదే తానన్నారు.  లోచర్ల విజయ భాస్కర్ రెడ్డి ఎలాంటి వాడో పుట్టపర్తి(Puttaparthi) ప్రజలకు తెలుసన్నారు. తండ్రి విగ్రహాన్ని సైతం వాళ్లే తొలగించుకున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా..వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈ నెల 14 న నల్లమాడ మండలంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే దుద్దుకుంట వివరించారు. జగన్ ఆదేశాలు శిరసా వహిస్తానన్న దుద్దుకుంటా..ఆయన చెప్పినట్లే అసమ్మతి నేతలను సైతం కలుపుకుని వెళ్తానన్నారు. 


రౌడీ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రౌడీయిజం తో అందరినీ బెదిరించాలని చూస్తున్నారని....ఆయన బెదిరింపులకు భయపడేవారు లేరని లోచర్ల విజయ్ భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే అవినీతి, భూదందాలు, అక్రమ సంపాదన బయటపెడతామని హెచ్చరించారు. వైసీపీలో కీలక నేతలిద్దరూ ఇలా రోడ్డునపడి తిట్టుకుంటుంటే కేడర్ కు ఏం పాలుపోవడంలేదు. ఎన్నికల ముందు ఈ తలనొప్పి ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వీలైనంత త్వరగా ఈ గొడవకు ముగింపు పలకకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని కోరుతున్నారు.