AP BJP :  అమరావతి రాజధానికి భారతీయ జనతా పార్టి కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ జోనల్ సమావేశం కోసం గుంటూరు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.  అమరావతి రాజధాని పై భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని  స్పష్టం చేశారు.  రాజధాని విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను మెదటి నుండి తమ పార్టీ వ్యతిరేకిస్తోందని గుర్తు చేశారు.  ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదని అన్నారు. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.


ఏపీ బీజేపీపై తప్పుడు ప్రచారం 


ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం  చేస్తున్న సాయం పై కొందరు లేని పోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యధిక ఇళ్లు ఆంధ్రప్రదేశ్ కు  కేంద్రం కేటాయించిందని అన్నారు.  ఒక్కో ఇంటికి లక్షా 80 వేలు డబ్బులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు.  రాష్ట్రంలో నిర్మించిన ఇళ్ల పై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంజూరు చేసి ప్రారంభించిన విషయాల పై కూడా కావాలనే బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చి నిర్మించే వరకూ తాత్కాలిక భవనాల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యా సంస్దలు తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు.  ఎన్నోప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుండి వచ్చాయని, ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికి వాటికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని మండిపడ్డారు. 


ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు


రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలకు సగం నిధులు కేంద్రం అందిస్తుందని  పురందేశ్వరిస్పష్టం చేశారు.  గురజాల వైద్య కళాశాల పనులు చివరి దశకు చేరుకున్నాయంటే అందుకు కేంద్రం సహకారమే ప్రదానమని ఆమె వివరించారు.  విజయవాడ బైపాస్ పనులు వేగంగా జరుగుతున్నాయని, అందులో కేంద్రం వాటా కూడా ఉందని అన్నారు.  రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని.. రైల్వే అనుసంధానం లో భాగంగా కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణ పనులు చేపట్టిందన్నారు. అమరావతి ని స్మార్ట్ సిటీగా ప్రకటించి రెండు వేల కోట్లకు పైగా నిధులు కేటాయించింది  కేంద్ర ప్రభుత్వమేనని తెలిపారు.  రాజధానిగా అమరావతికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రత్యేకంగా చెబుతున్నానని..  రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నా ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవటం లేదని మండిపడ్డారు. కనీసం మత్స్యకారులకు అవసరమైన సహకారం కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. 


దళితులు, బీసీలపై దాడులు హేయం 


చీరాలలో కిరణ్ అనే దళితుడిని, బాపట్ల జిల్లాలో బీసీ విద్యార్థిని చంపటం హేయమని  పురందేశ్వరివిమర్శించారు.  రాష్ట్రంలో దళితులు, వెనుకబడిన వర్గాల పై రోజూ దాడులు జరుగుతున్నాయన్నార.ు  వైసీపీ  పాలనలో రాష్ట్రానికి కొత్తగా ఒక పరిశ్రమ వచ్చిందా అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుక మైనింగ్ చేస్తున్నారని  గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకపోయినా పట్టించుకోలేదని మండిపడ్డారు.  ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరు మార్పు తో ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ఐదు వైద్య కళాశాలల్లో పేమెంట్ సీట్లు పెట్టి అమ్ముకోవటానికా అని ప్రశ్నించారు.  విద్యుత్ చార్జీలు రకరకాలగా భారం మోపుతున్నారుని, జగన్  ప్రభుత్వం పేదలకు రావాల్సిన నిధులను దోచుకుంటుందని ఆరోపించారు.  ఆయుష్మాన్ భారత్ వద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణం విషయంలో పేదలు, అమరావతి రైతులు ఇద్దరికీ న్యాయం జరగాలన్నారు.