Purandeshwari alleged that civil service officers are committing irregularities in AP:  ఏపీలో దొంగ ఓట్లపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల వ్యవహారంలో ఇటీవల ఓ ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అంతేకాదు ఐపీఎస్, అధికారులపై పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం కోసం పని చేయాలని, ప్రజల పట్ల అంకిత భావంతో ఉండాలని సూచించారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు అధికారులు అనుకూలంగా వ్యవహరించకూడదన్నారు. అధికారులు తప్పులు చేయొద్దని.. అలా చేస్తే కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని పురంధేశ్వరి హెచ్చరించారు.                           


తాము ఫిర్యాదు చేయడం వల్లే ఐఏఎస్ అధికారి గిరీషా విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. వైసీపీ నాయకులు, అధికారులు కలిసి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వైసీపీ తక్కవ మార్జిన్‌తో ఓడి పోయే చోట ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని.. తమకు సమాచారం ఉందని తెలిపారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమిస్తామని మంత్రి ధర్మాన చెబుతున్నారని.. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని పురంధేశ్వరి పేర్కొన్నారు. మంత్రి చేసిన కామెంట్లు తమను ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు.                     


అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి దొంగ ఓట్ల  వ్యవహారంపై ఫిర్యాదు చేశామన్నారు. నకిలీ ఓటరు గుర్తింపు కార్డులపై సమాచారం బిజెపి దృష్టికి తీసుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లతో గట్టెక్కాలని చూస్తోందని తక్కువ మార్జిన్‌తో సీట్లను కోల్పోతామని భావించే నియోజకవర్గాల్లో ఈ తరహా కుట్రలకు నాంది పలుకిందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని ప్రజలకి వివరిస్తున్నామని చెప్పారు. పల్లెకి పోదాం పేరుతో బీజేపీ నాయకులు గ్రామాలలో నివసించి, వారితో మమేకమై రాష్ట్రానికి మోదీ సేవల గురించి వివరించినట్టు తెలిపారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంతో గొప్ప కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని, ఈ నిర్మాణం జరిగితే హిందూ - ముస్లిమ్స్ మధ్య గొడవలు తలెత్తుతాయన్న విమర్శలని తిప్పి కొట్టగలిగామన్నారు.                   


తిరుపతి ఉప ఎన్నికల్లో తప్పుడు దారిలో గెలిచిన వ్యక్తిని అనర్హుడిగా గుర్తించి గెలుపును రద్దు చేయాలని ఎన్నికల దృష్టికి గతంలోనే తీసుకెళ్ళామన్నారు. ఏపీలో ఎన్నికల పొత్తులపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, పొత్తు ఉన్నా లేకపోయినా బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పారు.  ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.