Pulivendula Vontimitta ZPTC elections counting : సాధారణ ఎన్నికల స్థాయిలో జరిగిన రెండు జడ్పీటీసీ స్థానాల ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల కౌంటింగ్ కడప పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతుంది.  పులివెందుల ZPTC కౌంటింగ్‌కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పదివేల లోపే ఓట్లు ఉండటంతో  ఒకే రౌండ్‌లో   పులివెందుల ZPTC కౌంటింగ్ పూర్తవుతుంది.  ఒంటిమిట్ట ZPTC కౌంటింగ్‌కు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు.  రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది.  ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికి ఫలితాలు ప్రకటిస్తారు.   

పులివెందుల ఫలితంపై అందరికీ ఆసక్తి             

రెండు జడ్పీటీసీలు కడప జిల్లాలో ఉండటం.. అందులోనూ ఒకటి జగన్ కుంచుకోట లాంటి పులివెందుల నియోజకవర్గంలో మండల కేంద్రం కావడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి ఏర్పడింది. హోరాహోరీగా ఎన్నికలు జరుగుతాయని అనుకున్నా.. వైసీపీ అధినేత జగన్ తో పాటు ఇతర నేతలు ముందు నుంచి ఆత్మరక్షణ ధోరణితో రాజకీయాలు చేశారు. ఎన్నికలు అక్రమాలు జరిగిపోతున్నాయని ఆరోపిస్తూ వస్తున్నారు. దీంతో ఓటమి భయంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్న అభిప్రాయం బలపడింది. పోలింగ్ అసలు సరిగ్గా జరగలేదని అంతా దొంగ ఓట్లు వేశారని పోలింగ్ తర్వాత ఆరోపించారు. దీంతో పూర్తిగా వైసీపీ చేతులెత్తేసినట్లు అయింది.         

ఫలితం నాలుగైదు వందల ఓట్ల తేడాతోనే - రీపోలింగ్ బహిష్కరించడమే వైసీపీకి మైనస్ ?      

మరో వైపు పులివెందులలో రెండు పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ జరిగింది. వైసీపీ నేతల ఫిర్యాదుతోనే రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించారు. అనూహ్యంగా ఈ రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ ను వైసీపీ బహిష్కరించింది. ఈ నిర్ణయం వైసీపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. పులివెందులలో ఉన్నది పదివేల మంది ఓటర్లే. హోరాహోరీగా జరిగిన పోరులో.. ఫలితం చాలా కొద్ది ఓట్ల తేడాతోనే ఉండవచ్చని భావిస్తున్నారు. నాలుగైదు వందల ఓట్లతేడాతోనే ఫలితం ఉంటుందని టీడీపీ నేతుల కూడా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో దాదాపుగా పన్నెండు వందల ఓట్లు ఉన్న రెండు పోలింగ్ బూత్‌లలో పోలింగ్ ను బహిష్కరించడంతో.. కేవలం టీడీపీ ఓటర్లు మాత్రమే అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఫలితాల తర్వాత మారనున్నరాజకీయం            

 కౌంటింగ్ లో పులివెందుల.. మూడు, నాలుగు వందల ఓట్ల తేడాతో వైసీపీ కోల్పోతే అప్పుడు ఈ రెండు పోలింగ్ బూత్‌లలో పోలింగ్ బహిష్కరించినందుకు తీరిగ్గా బాధపడాల్సి వస్తుంది. అప్పు చేయగలిగేమీ ఉండదు. వైఎస్ కుటుంబంపై ఎంతో ఆప్యాయత ఉన్న ఓటర్లు ఖచ్చితంగా వైసీపీకే ఓటు వేస్తారన్న నమ్మకం ఉన్నా... వైసీపీ ముందుగానే చేతులెత్తేసినట్లుగా వ్యవహరించడం చాలా మందిని ఆశ్చర్య పురస్తోంది. ఖచ్చితంగా ఓడిపోతామని ఎందుకనుకుంటున్నారోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల ఫలితం వైసీపీకి అనుకూలంగా వస్తుందని కొంత మంది కార్యకర్తలు ఇప్పటికీ  బలంగా నమ్ముతున్నారు.