BTech Ravi :    ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై మాజీ ఎమ్మెల్సీ, కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు జగన్ కుట్ర పన్నారని చెప్పారు. ఇందులో భాగంగానే గన్‌మన్లను తొలగించారని అన్నారు. ‘బీటెక్ రవికి ఏదైనా జరిగితే బాధ్యత నాదే’ అని జగన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవి కాలం ముగియడంతో ఆయన గన్ మెన్లను తొలగించినట్లుగా తెలుస్తోంది. అయితే పులివెందుల సున్నితమైన ప్రాంతం కావడం. ఫ్యాక్షన్ జోన్ కావడంతో  తనకు గన్ మెన్లు కేటాయించాలని ఆయన కోరుతున్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మొదట గన్ మెన్లు కేటాయించకపోతే ఆయన కోర్టుకు వెళ్లి తెచ్చుకున్నరు. కాను కూడా కోర్టుకు వెళ్తానని బీటెక్ రవి ప్రకటించారు. 


తనను నియోజకవర్గంలో తిరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.   కాన్వాయ్‌తో వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని బీటెక్ రవి చెప్పారు. తనకు ఏదైనా జరిగితే జగన్, భారతీ, ఎంపీ అవినాశ్ రెడ్డిదే బాధ్యతని అన్నారు. వైసీపీ రాష్ట్రంలో ఉన్న భవనాలను కూల్చి, పునఃనిర్మిస్తోందని విమర్శించారు. ఆ డబ్బును సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే రైతులకైనా మేలు జరిగేదని చెప్పారు.  ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంపై వైసీపీ దృష్టి పెట్టట్లేదని అన్నారు. నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకుంటారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.                         


అభ్యర్థుల మార్పుల్లో భాగంగా జగన్ తనను తాను మార్చుకోవాలని బీటెక్ రవి అన్నారు. జగన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచి తానూ పోటీ చేసేలా చంద్రబాబు తనకు అవకాశం కల్పించాలని కోరారు.  జగన్‌‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మండిపడ్డారు. జమ్మలమడుగులో నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో జగన్‌రీ ఇదే చివరి క్రిస్మస్ అని అన్నారు. జగన్ గండికోట, రాజోలి, భూ బాధితులకు ఎటువంటి హామీలు ఇవ్వలేదని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌పై ఎటువంటి ప్రకటన చేయలేదని చెప్పారు.                                       


ఇటీవల బీటెక్ రవి పోలీసులు రాత్రి పూట అరెస్టు చేయడం కలకలం రేపింది.   మప్టీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకుని రెండుగంటలు ఎక్కడెక్కడో తిప్పారు.  మొదట వల్లూరు పీఎస్‌కు తరలించిన పోలీసులు.. అనంతరం అక్కడ్నుంచి నేరుగా కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అయితే తనను చంపేందుకు ప్రయత్నించారని బీటెక్ రవి ఆరోపించారు.  నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించినప్పుడు రవి.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని కేసు పెట్టారు. ఈ కేసు పెట్టి పది నెలలు అయిన తర్వాత  అరెస్టు చేశారు. పది నెలలు తమకు బీటెక్ రవి కనిపించలేదని పోలీసులు చెప్పారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడ్డారు.