TDP News In Telugu: పులివెందుల: టీడీపీ నేత బీటెక్‌ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి పులివెందులకు వస్తుండగా కొందరు ఆయనను అదుపులోకి తీసుకున్నారని బీటెక్ రవి కుటుంబసభ్యులు తెలిపారు. పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అదుపులోకి తీసుకున్న అనంతరం బీటెక్ రవిని పోలీసులు వల్లూరు పీఎస్‌కు తరలించారు. అనంతరం కడపకు తరలించి రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించి.. తరువాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మొదట బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్న తీరుతో కుటుంబసభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కిడ్నాప్ చేసి ఉండొచ్చునని బీటెక్ రవి భార్య ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతకు ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని పార్టీ నేతలు చెబుతున్నారు.


టీడీపీ నేత బీటెక్ రవిని పాత కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం ప్రారంభానికి ముందు కడప పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో కడప ఎయిర్ పోర్టు వద్ద బీటెక్ రవి ఆందోళనకు దిగిన కేసులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన సమయంలో పోలీసులతో బీటెక్ రవి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ తాజాగా టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏ కేసులో అరెస్ట్ చేశారనేదానిపై సమాచారం లేకపోవడంతో బీటెక్ రవి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.


బీటెక్ రవి అరెస్టును ఖండించిన నారా లోకేష్
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్ అక్రమంటూ నారా లోకేష్ స్పందిస్తూ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుట్టిన ఊరు, గెలిచిన నియోజ‌క‌వ‌ర్గం అయిన పులివెందుల వెళ్లాల్సి వ‌చ్చినా సీఎం జగన్ గ‌జ‌గ‌జా వ‌ణుకుతున్నాడంటూ సెటైర్లు వేశారు. ప‌ర‌దాలు, బారికేడ్లు, ముంద‌స్తు అరెస్టులు, దుకాణాల మూసివేత‌, చెట్ల న‌రికివేత ఇన్ని చేసినా ఓట్లేసిన జ‌నంని చూడాలంటే జ‌గ‌న్ రెడ్డికి భ‌యం వేస్తుందన్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల్ని ఎదుర్కోలేని పిరికి పంద జ‌గ‌న్ అంటూ ఘాటు వ్యాఖ్యలుచేశారు. త‌న ఎన్నిక‌ల ప్రత్య‌ర్థి, టిడిపి ఇన్చార్జి బీటెక్ ర‌విని చూసినా జగన్ భయపడుతున్నారని... రాజకీయ కక్షసాధింపుకి పోలీసుల్ని పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారని ఆరోపించారు. బీటెక్ రవి అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు. బీటెక్ రవికి ఏం జ‌రిగినా సీఎం జ‌గ‌న్, పోలీసుల‌దే బాధ్యత‌ అని ట్విట్టర్ (ఎక్స్) లో పోస్ట్ చేశారు. 






టీడీపీ ఎమ్మెల్సీ  బీటెక్ రవి అదృశ్యం అయిన వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. బీటెక్ రవిని కిడ్నాప్ చేశారా... లేక పోలీసులు అరెస్ట్ చేశారోనని ఆరా తీశారు. జిల్లా ఉన్నతాధికారుల ను ఫోన్ లో కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నం చేయగా.. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించలేదు. దాంతో కొన్ని గంటలపాటు బీటెక్ రవి ఫ్యామిలీ, ఆయన మద్దతుదారులు టెన్షన్ పడ్డారు.