Pulivendula High Tension : కడప జిల్లా పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత ముందస్తు బెయిల్ పై తుదితీర్పు వెల్లడిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను బుధవారానికి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఈ పరిణామాల మధ్య కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నారు. అయితే సీబీఐ అధికారులు ఇప్పటికే పులివెందులకు చేరుకుని ఊరి శివార్లలో ఎదురుచూస్తున్నారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి కోసం అనుచరులు పెద్ద ఎత్తున పులివెందులకు తరలివచ్చారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనే వైసీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి.  


పులివెందులకు చేరుకున్న అవినాష్ రెడ్డి 


మరో వైపు అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు  తన మధ్యంతర బెయిల్ ను కొట్టి వేసిన తర్వాత హైదరాబాద్ ఇంటి నుంచి బయలుదేరిన ఆయన... మంగళవారం మధ్యాహ్నం ఆయన పులివెందుల చేరుకున్నారు. అనుచరులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాదర్భార్ కూడా నిర్వహిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. సీబీఐ అరెస్ట్ చేస్తే ఎలాంటి వ్యూహం అవలంభించాలన్నదానిపై అవినాష్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వైపు సీబీఐ అధికారులు కూడా పులివెందులలోనే ఉన్నారు. పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. 


దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు


వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరి ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. దస్తగిరి భద్రతపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే తెలియజేయాలని దస్తగిరికి సూచించారు. ఈ కేసు విచారణలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అప్రమత్తంగా ఉండాలని దస్తగిరిని హెచ్చరించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తెలియజేయాలని దస్తగిరికి సీబీఐ అధికారులు తెలియజేశారు.  


ముందస్తు బెయిల్ పై టెన్షన్ 


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను బుధవారానికి తెలంగాణ హైకోర్టు వాయిదావేసింది. ముందుగా ఈ కేసు విచారణ ఉదయం ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే    సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని అవినాష్ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీంతో ఆర్డర్ కాపీని చూసిన తర్వాతే తుది తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందిన  తర్వాత మధ్యాహ్నం మళ్లీ విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు బుధవారం వింటామని న్యాయమూర్తి .. కేసును వాయిదా వేశారు. గత విచారణలో ఈనెల 25 వరకు అవినాష్‌ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని, తాము చెప్పిన విధంగా అవినాష్‌ను విచారించాలని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అలాగే అవినాష్ మధ్యంతర బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. దీనిపై సునీతరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.  అలాగే ముందస్తు బెయిల్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో  హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగాల్సి ఉంది. బుధవారం ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ వస్తుంది.