YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను బుధవారానికి తెలంగాణ హైకోర్టు వాయిదావేసింది. ముందుగా ఈ కేసు విచారణ ఉదయం ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని అవినాష్ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీంతో ఆర్డర్ కాపీని చూసిన తర్వాతే తుది తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత మధ్యాహ్నం మళ్లీ విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు బుధవారం వింటామని న్యాయమూర్తి .. కేసును వాయిదా వేశారు.
గత విచారణలో ఈనెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని, తాము చెప్పిన విధంగా అవినాష్‌ను విచారించాలని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అలాగే అవినాష్ మధ్యంతర బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. దీనిపై సునీతరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అలాగే ముందస్తు బెయిల్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగాల్సి ఉంది. బుధవారం ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ వస్తుంది.
మరో వైపు అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు తన మధ్యంతర బెయిల్ ను కొట్టి వేసిన తర్వాత హైదరాబాద్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన పులివెందుల చేరుకున్నారు. అనుచరులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాదర్భార్ కూడా నిర్వహిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. సీబీఐ అరెస్ట్ చేస్తే ఎలాంటి వ్యూహం అవలంభించాలన్నదానిపై అవినాష్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో వైపు సీబీఐ అధికారులు కూడా పులివెందులలోనే ఉన్నారు. పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఆదివారం మధ్యాహ్నం నుంచి పలు అంశాలపై సీబీఐ అధికారులు పులివెందులలో విచారణ జరుపుతున్నారు. వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను పిలిపించుకుని పలు అంశాలపై ఆరా తీశారు. హత్య జరిగిన రోజు ఇనయతుల్లా బాత్‌రూంలో మృతదేహాన్ని తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసి కుటుంబ సభ్యులకు పంపారు. ఇనయతుల్లాను వెంటబెట్టుకుని అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. రెండుసార్లు పులివెందుల పరిసర ప్రాంతాలు పరిశీలించారు. వివేకా ఇంటినుంచి అవినాశ్ రెడ్డి ఇంటివద్దకు రెండుసార్లు వాహనాల్లో తిరిగారు. వాహనాల్లో వెళ్లడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై సాంకేతిక ఆధారాలు సేకరించారు. అవినాశ్‌రెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత? అన్నదానిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ నేపధ్యంలో సీబీఐ బృందం పులివెందుల రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ దగ్గర ఉన్న ఆధారాలను సాంకేతికంగా నిర్ధారించుకోవడానికి సీబీఐ అధికారులు ఇలా చేస్తున్నారని అంటున్నారు.