అనంతపురం (Anantapuram)జిల్లా హిందూపురం()Hindupuramలో అఖిలపక్షం నేతలు భగ్గుమన్నారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడాన్ని వాళ్లంతా తప్పుపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా అఖిలపక్ష కమిటీ ఛైర్మన్ చలపతి చేసిన ప్రసంగం ఉద్ధ్రిక్తతకు దారి తీసింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)ను మూర్ఖుడని సంబోధించడం వివాదానికి దారి తీసింది. 


ముగ్గురు మూర్ఖుల మాటతో వివాదం


హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడానికి ముగ్గురు మూర్ఖులు కారణమంటూ అఖిలపక్ష కమిటీ ఛైర్మన్ చలపతి కామెంట్ చేశారు. హిందూపురం ఎమ్మెల్యే,  ఎమ్మెల్సీ, ఎంపీలు మూర్ఖులని వ్యాఖ్యానించడంతో వివాదం రాజుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మూర్ఖుడని.. ఆయన చేతకానితనం వల్లే హిందూపురం జిల్లాగా గానీ జిల్లా కేంద్రంగా కానీ చేసుకోలేకపోయామన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 


బాలకృష్ణపై ఘాటు విమర్శలు


హిందూపురం జిల్లాగా మారకపోవడానికి బాలకృష్ణతోపాటు ఎమ్మెల్సీ ఇక్బాల్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవన్‌పై కూడా చలపతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటిల రాజకీయాలు మానుకుని ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎమ్మెల్సీ ఇక్బాల్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.  


భగ్గుమన్న టీడీపీ


అఖిలపక్ష నేతలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ(TDP) నేతలు. బాలకృష్ణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిపై దాడికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నా కాస్త గందరగోళానికి దారి తీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని రెండు వర్గాలను చెదరగొట్టారు. బాలకృష్ణను మూర్ఖుడు అన్న అఖిలపక్ష కమిటీ ఛైర్మన్‌పై దాడికి యత్నించారు తెలుగుదేశం శ్రేణులు. 


కోనసీమ జిల్లాలో నిరసనలు


కోనసీమ జిల్లాలో కూడా నిరసనలు హోరెత్తాయి. రాజ్యాంగ నిర్మాత  బి ఆర్ అంబేద్కర్(Ambedkar) పేరు పెట్టాలని కోనసీమ కలెక్టరేట్ వద్ద దళితలు ఆందోళనలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. కానీ వాళ్లన పోలీసుల అడ్డుకున్నారు. 


కొత్త జిల్లా ఆవిర్భావంలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి ముందుగానే కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నించాయి దళిత సంఘాలు. దళితుల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్ ఇప్పుడు వాళ్లకు  అన్యాయం చేశారని నినాదాలు చేశారు. 


కోనసీమను అంబేద్కర్ జిల్లాగా మార్చాలన్న డిమాండ్‌తో ఆందోళన చేపట్టిన నిరసనకారులు కలెక్టరేట్ ముందు బైఠాయించేందుకు యత్నించారు. పోలీసులు కలుగుచేసుకొని వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు మాట వినకపోయేసరికి దళిత నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా అక్కడ కాసేపు ఉద్ధ్రిక్తత వాతావరణం నెలకొంది.