Probation of village and ward secretariat employees :   గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసే ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేసినట్లుగా సమచారం. పీఆర్సీ చర్చల సమయంలో హామీ ఇచ్చినట్లుగా జూలై నుంచి ప్రొబేషన్ ఖరారు చేశారు. రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకుని .. డిపార్టుమెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారంతా ప్రొబేషన్‌కు అర్హులని తేల్చినట్లుగా తెలుస్తోంది. వీరందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం జూలై నుంచి  వేతనాలు అందిస్తారు. 


ఎంత మంది పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారో లేని స్పష్టత 


అయితే డిపార్టుమెంటర్ పరీక్షల్లో ఎంత మంది ఉత్తీర్ణులయ్యారన్నదానిపై స్పష్టత లేదు.  వాస్తవానికి 2021 అక్టోబర్‌ నాటికే సచివాలయ ఉద్యోగులకు రెండేళ్ల సర్వీసు పూర్తయింది. నోటిఫికేషన్‌ ప్రకారం వారందరి సర్వీసుల్నీ రెగ్యులర్‌ చేయాలి. కానీ అంతకు కొన్ని నెలల ముందు నుంచే డిపార్ట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ టెస్ట్‌ వంటి రకరకాల పరీక్షలను తెరపైకి తెచ్చి ప్రొబేషన్‌ను మరింత ఆలస్యం చేశారు. ఆయా పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి ప్రొబేషన్‌ డిక్లేర్‌ చెప్పటంతో ఆందోళన బాట పట్టారు.


టెస్టులతో సంబంధం లేకుండా ప్రొబేషన్ ఇవ్వాలని డిమాండ్ 


సకాలంలో ప్రొబేషన్‌ ప్రకటించాలని, టెస్టులతో సంబంధం లేకుండా అందరి సర్వీసుల్నీ రెగ్యులర్‌ చేయాలని ఉద్యమం చేయడం జులై నుంచి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇందులో భాగంగానే ఆరు నెలలుగా ప్రభుత్వం శాఖల వారీగా వారి పరిధిలో ఉన్న సచివాలయ ఉద్యోగులు, వారిలో డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు ఉత్తీర్ణులు అయిన వారు, కాని వారు తదితర వివరాలతో నివేదికలు సేకరించారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖల్లో డిపార్ట్‌మెంట్‌ పరీక్షలు ఆలస్యంగా నిర్వహించటంతో వారి వివరాలు ఆలస్యంగా అందాయి. వీరందరికీ ప్రొబేషన్ ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. 


పీఆర్సీ ప్రకారమే జీతాల ఖరారు


గ్రామ సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శులకు రూ. 15,030 కనిష్టంగా పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. డిజిటల్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, ఫిషరీస్‌ అసిస్టెంట్, ఏఎన్‌ఎం, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, గ్రేడ్‌–2 అగ్రికల్చర్‌ అసిస్టెంట్, హార్టికల్చర్‌ అసిస్టెంట్, సెరికల్చర్‌ అసిస్టెంట్, విలేజ్‌ సర్వేయర్, వీఆర్వో, వేల్ఫ్‌ర్‌ అసిస్టెంట్లకు రూ. 14,600 కనిష్ట పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా పీఆర్సీ కమిటీ సిఫార్సు చేసింది. వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీకి రూ. 15,030 కనిష్ట పే స్కేలును సిఫార్సు చేయగా, గరిష్టంగా రూ. 46,060గా పేర్కొంది. మిగిలిన వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్‌–డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులరైజేషన్‌ సెక్రటరీ, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, వెల్ఫ్‌ర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలకు రూ. 14,600 కనిష్టంగా పే స్కేలును ప్రతిపాదించగా, గరిష్ట పే స్కేలు రూ. 44,870గా ఉండనుంది.