Praveen Prakash trying to rejoin:  ఏపీ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత, తిరిగి సర్వీసులోకి రావాలని కోరుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఒకప్పుడు చక్రం తిప్పిన ఈ అధికారి, ఇప్పుడు తన నిర్ణయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మీడియా ముందు వాపోవడానికి కారణం పోస్టింగ్ కోసమేనని అంటున్నారు. 

Continues below advertisement

విఆర్ఎస్ నుంచి  పశ్చాత్తాపం వరకు!

వైసీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత శక్తివంతమైన అధికారిగా వెలుగొందిన ప్రవీణ్ ప్రకాష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే  విఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నారు. తన లేఖను సచివాలయం పోస్ట్ బాక్స్‌లో వేసి వెళ్ళిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.  ఆరేళ్ల సర్వీసు ఉండగానే తీసుకున్న ఈ నిర్ణయం తప్పని ఆయనకు ఏడాదిన్నర తిరగకముందే అర్థమైనట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆయన వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ, తాను చేసిన తప్పులను ఒప్పుకోవడం, క్షమాపణలు కోరడం చూస్తుంటే.. ఆయనకు మళ్లీ ఐఏఎస్ హోదా కావాలనే ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది.

Continues below advertisement

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

నిబంధనల ప్రకారం, ఒక ఐఏఎస్ అధికారి సమర్పించిన విఆర్ఎస్ దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించి, సదరు అధికారి రిలీవ్ అయిన తర్వాత దానిని వెనక్కి తీసుకోవడం  అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.  సాధారణంగా విఆర్ఎస్ అమల్లోకి రాకముందే దానిని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం రాజీనామాను లేదా విఆర్ఎస్‌ను ఆమోదించిన తర్వాత, దానిని రద్దు చేసి తిరిగి సర్వీసులోకి తీసుకోవడం అనేది అరుదుగా, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది. దీనికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ  అనుమతితో పాటు రాష్ట్ర ప్రభుత్వ బలమైన సిఫార్సు అవసరం.

అధికారుల్లో ప్రవీణ్ ప్రకాష్‌కు లేని మద్దతు

ప్రవీణ్ ప్రకాష్ సర్వీసులో ఉన్నప్పుడు తన తోటి ఐఏఎస్ అధికారులతో ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఆయనకు పెద్ద శాపంగా మారింది. గత ప్రభుత్వంలో ఆయన  అతి  వల్ల ఇబ్బందులు పడ్డ అధికారులు, అవమానాలకు గురైన వారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్నారు. ప్రవీణ్ ప్రకాష్ వల్ల ఇబ్బందులకు గురైన సహచర అధికారులు, ఆయనను మళ్లీ వ్యవస్థలోకి రానివ్వడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఒక అధికారిపై ఇతర అధికారులందరిలోనూ ఇంత వ్యతిరేకత ఉండటం ఆయన పునరాగమనానికి ప్రధాన అడ్డంకి.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణంగా అధికారుల పట్ల కక్షసాధింపు ధోరణితో ఉండరు. గతంలో చంద్రబాబుకు ప్రవీణ్ ప్రకాష్ సన్నిహితంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, గత ఐదేళ్లలో ఆయన వ్యవహరించిన తీరు, వ్యవస్థలను ప్రభావితం చేసిన విధానం చంద్రబాబుకు కూడా తెలుసు. ఇప్పుడు ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఆయనను మళ్లీ చేరదీస్తే అది ఇతర అధికారులకు తప్పుడు సంకేతాలు పంపుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రవీణ్ ప్రకాష్ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు! 

ప్రస్తుతానికి ప్రవీణ్ ప్రకాష్ చేస్తున్న ప్రయత్నాలు అరణ్య రోదనగానే కనిపిస్తున్నాయి. ఒక అధికారిగా ఆరేళ్ల సర్వీసును వదులుకుని బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు మీడియా వేదికగా తన బాధను చెప్పుకోవడం వల్ల సానుభూతి కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునే అవకాశాలు దాదాపు శూన్యమని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. అటు నిబంధనలు సహకరించకపోవడం, ఇటు రాజకీయంగానూ, అధికారికంగానూ మద్దతు లేకపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ అధికారి  హోదాలోనే మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.