AP Fiber Net MD: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలకు కారణం అయిన పైబర్ నెట్ వ్యవహారంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఎండీగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్యకు అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం  ప్రవీణ్ ఆదిత్య మారిటైంబోర్డు సీఈవోగా ఉన్నారు. ఆ బాధ్యలతో పాటు ఫైబర్ నెట్ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అలాగే బదిలీ అయిన దినేష్ నిర్వహిస్తున్న డ్రోన్, గ్యాస్ కార్పొరేషన్ల చైర్మన్ బాధ్యతలను కూడా అదనంగా ప్రవీణ్ ఆదిత్యకే ఇచ్చారు. దినేష్ కుమార్ ను అన్ని పోస్టుల నుంచి రిలీవ్ చేసి..పోస్టింగ్ లేకుండా జీఏడీలో రిపోర్టు చేయమని ప్రభుత్వం ఆదేశించింది.


ఫైబర్ నెట్‌లో ఏర్పడిన వివాదం కారణంగా జీవీ రెడ్డి తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇక ఏ పార్టీలో చేరబోనని లాయర్ గా పని చేసుకుంటానని ప్రకటించారు. ఆ తర్వాత కాసేపటికే ఎండీ దినేష్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. పోస్టింగ్ లేకుండా జీఏడీలో రిపోర్టు చేయమని ఆదేశించింది. దినేష్ కుమార్ వైసీపీ నేతల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. రెండు నెలల కిందట తాను ఉద్యోగం నుంచి తీసేయమని చెప్పిన 410 మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల కూడా వారికి జీతాల బిల్లు రెడీ అయిందని అంటున్నారు.               


అలాగే రామ్ గోపాల్ వర్మకు చెల్లించిన డబ్బులవిషయంలోనూ ఆయన తిరిగి ఇచ్చేది లేదని సమాధానం ఇచ్చారని ఆయనపై కేసు పెట్టాలని తాను ఉత్తర్వులు ఇస్తే  దానిపై సంతకం చేయలేదని జీవీ రెడ్డి అన్నారు. అయితే ఈ వ్యవహారాలన్నీ ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా.. ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడటంతోనే వివాదం అయింది. ప్రభుత్వ  పెద్దల దృష్టికి తీసుకెళ్లి విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయడమేమిటని టీడీపీ హైకమాండ్ మండిపడింది. దీంతో చివరికి ఆయన  రాజీనామా చేయాల్సి వచ్చింది. తనకు అవమానంగా భావించి జీవీ రెడ్డి పార్టీకి కూడా రాజీనామా చేశారు.                    


జీవీరెడ్డి రాజీనామా అంశం .. టీడీపీ క్యాడర్ లో ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల్లో అలజడి రేపింది. ఆయనకు అందరూ మద్దతుగా నిలిచారు. అయితే టీడీపీ మాత్రం జీవీ రెడ్డి ఇటీవలి కాలంలో పార్టీ ను ధిక్కరిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారని అంటున్నారు.  మొదటి విడత కార్పొరేషన్ చైర్మన్ల జాబితాలో ఆయన  పేరు లేదు. అయితే మీడియాలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తర్వాత రెండో జాబితాలో ఆయనకు కీలకమైన ఫైబర్ నెట్ పదవి ఇచ్చారు. విద్యాధికుడు అియన ఆయన రాజకీయంగా ఆ పదవికి ఉన్న అధికారాలను బట్టి నడుచుకోకుండా..ఏదో చేయాలని అనుకోవడంతోనే సమస్య వచ్చిందని భావిస్తున్నారు.                 


Also Read:  పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్