BJP Leader Vishnuvardhan Reddy Target Prakash Raj:  నటుడు ప్రకాష్ రాజ్  చుట్టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న ధర్మస్థల కుట్ర కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. కర్ణాటకలోని అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం ధర్మస్థల ప్రతిష్టను, అక్కడ ధర్మాధికారిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర హెగ్గడే ప్రతిష్టను మసకబార్చేందుకు కొందరు వ్యక్తులు భారీ కుట్రకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ధర్మస్థలలో వందలాది మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని, శవాలను సామూహికంగా పూడ్చిపెట్టారంటూ ప్రచారం చేసి నకిలీ అస్థిపంజరాల వివాదాన్ని సృష్టించిన ప్రధాన నిందితుడు చిన్నా అలియాస్ చిన్నయ్య.. ఇప్పుడు స్వయంగా కర్ణాటక హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌లో ప్రకాష్ రాజ్ పేరును ప్రస్తావించడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Continues below advertisement

కోర్టులో దాఖలైన పిటిషన్ ప్రకారం.. ధర్మస్థల క్షేత్రాన్ని బద్నాం చేయడానికి కేరళ తదితర ప్రాంతాల నుండి సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఒక వ్యవస్థీకృత కుట్ర జరిగిందని, అందులో భాగంగానే చిన్నయ్యకు రూ. 50 లక్షలు ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఈ కుట్ర పన్నుతున్న సమయంలో నిందితుల్లో ఒకరైన గిరీష్ మట్టనవర్.. ప్రకాష్ రాజ్‌కు ఫోన్ చేసి చిన్నయ్యకు ఇచ్చారని, ప్రకాష్ రాజ్ తమిళంలో మాట్లాడుతూ  వాళ్లు   చెప్పినట్లే వినాలని, జూన్ 29న తానే స్వయంగా వచ్చి నిన్ను కౌగిలించుకుంటానని చెప్పినట్లు చిన్నయ్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కర్ణాటక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ జరుపుతుండగా, కోర్టు సైతం జూన్ 29 లోగా సమగ్ర స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.     "ఈ వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఇది కోట్లాది మంది భక్తుల నమ్మకాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశం కాబట్టి సమాధానం చెప్పడం నా బాధ్యత. ప్రస్తుతం నేను దూరంగా ఉన్నాను, రెండు రోజుల్లో స్వయంగా మీడియా ముందుకు వచ్చి పూర్తి నిజాలు చెప్తాను. అంతవరకు కొందరు ఆకతాయిలు సృష్టిస్తున్న పుకార్లను నమ్మకండి." అని ప్రకాష్ రాజ్ ఎక్స్  వేదికగా కోరారు. 

మరోవైపు ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్‌ను టార్గెట్ చేస్తూ.. “ధర్మస్థల ఆలయంపై జరిగిన కుట్రలో మీ సహకారం ఉందని కుట్రదారుడే విచారణలో చెబుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. , ఈ కుట్రకు మీరే పాత్రధారి, సూత్రధారి అని కూడా ఆరోపిస్తున్నారు. అసలు 130 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను ఎందుకు దెబ్బతీశారు?  మీకు హిందువులంటే అంత వ్యతిరేకత ఎందుకు? హిందూ ధర్మాన్ని కించపరచడం ద్వారా మీరేం సాధించాలనుకుంటున్నారు?” అంటూ ఘాటు ప్రశ్నల వర్షం కురిపించారు.   

ఈ కేసు కేవలం ఒక నటుడి వ్యక్తిగత వివాదంలా కాకుండా, సనాతన ధర్మం మరియు ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయంపై జరిగిన అంతర్జాతీయ స్థాయి కుట్రగా మారుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్  దర్యాప్తులో ప్రకాష్ రాజ్ పాత్రపై మరిన్ని ఆధారాలు లభిస్తే ఆయన అరెస్టుకు సైతం దారితీయవచ్చని భావిస్తున్నారు.  రెండు రోజుల్లో ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి వివరణ ఇస్తారు? ఈ రూ. 200 కోట్ల కుట్ర వెనుక ఉన్న అసలు శక్తులెవరు? అనే విషయాలపైనే అందరి దృష్టి నెలకొంది.