Darsi Mla Maddisetty : వ్యక్తిగత కారణాల వల్ల గత కొన్ని నెలలుగా అందుబాటులో లేకపోయానని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. గడపగడపకు కార్యక్రమంతో పాటుగా కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండే వాడిని కానీ ఈ రెండున్నర నెలల్లో ఫుల్ టైం పాలిటిక్స్ కు దూరంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు వ్యక్తి గత కారణాలు తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యక్తిగత కార్యక్రమాలను ముగించుకోవడంతో ఇకపై పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వెల్లడించారు. నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని పత్రికలు, ఛానల్స్ లో పార్టీ మారబోతున్నట్టు వచ్చిన వార్తలు కల్పిత ప్రచారాలని అన్నారు. ఎన్నికల దగ్గర పడుతుండటంతో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటనే
సీఎం జగన్ ఒక గొప్ప నాయకుడు అటువంటి నాయకుడితో కలిసి నిలబడితే బాధ్యతగా రాజకీయాల్లో మిగిలినట్టేనని మద్దిశెట్టి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని అలాంటి వాటిని తట్టుకొని నిలబడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. 2019 ఎన్నికల సమయంలో దర్శిలో జగన్ తనకు పూర్తిగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. ప్రజాక్షేత్రంలో గెలిచి ముఖ్యమంత్రిగా జగన్ తో కలసి శాసనసభలో అడుగు పెట్టటం తన రాజకీయ జీవితంలో మరువలేనని తెలిపారు. భవిష్యత్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అడుగుజాడల్లో నడుస్తానని ఆయనకు తన పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే మద్దిశెట్టి అన్నారు. ఎటువంటి అవకాశం వచ్చినా దర్శి ప్రాంత ప్రజలకు మంచి చేశానని, ముఖ్యంగా గడపగడపకు కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్తున్నామని అన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి దర్శి నియోజిక వర్గంలో పలు అభివృద్ధి పనులు విజయవంతంగా చేశామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా దర్శి పట్టణానికి 125 కోట్ల రూపాయలతో సమగ్ర నీటి పథకం ద్వారా నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేసి, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేశామని, దశాబ్దాలుగా పెండింగ్ ఉన్న దర్శి - కురిచేడు రోడ్డును పూర్తి చేసిన విషయాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి గుర్తు చేశారు.
గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు
ముఖ్యమంత్రిగా జగన్ బటన్ నొక్కి సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందిస్తుంటే, ఆయన గ్రాఫ్ భారీగా పెరిగిపోతోందని, అయితే స్థానికంగా ఉన్న శాసనసభ్యుడి గ్రాఫ్ పడిపోతుందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీలో తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది. తరువాత ఆయన తన వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థాన్ని పార్టీ నేతలకు వివరించుకునే ప్రయత్నం చేయాల్సి వచ్చింది కూడా. అంతే కాదు గత ఏడాది డిసెంబర్ లో మద్దిశెట్టి కుమారుడి వివాహానికి కూడా సీఎం జగన్ హజరై ఆశీర్వదించారు.
గ్లోబల్ సమ్మిట్ పై గోబెల్స్ ప్రచారం
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో 352 ఎంఓయూలు, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. వీటన్నిటిని చూస్తే సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధిని సమాన ప్రతిపాదికన ముందుకు తీసుకు వెళ్తున్నారని అన్నారు. అయితే ఇటువంటి కార్యక్రమాలపై ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారం చేయటం దారుణమని ఎమ్మెల్యే మద్దిశెట్టి వ్యాఖ్యానించారు.