Poonam Kaur: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజున శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మను ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఆమె అమ్మవారి దర్శనానికి వచ్చారు. అనంతరం పూనం కౌర్ మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు గురించి స్పందించారు. చంద్రబాబును జైల్లో పెట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు వయసు 73 ఏళ్లు అని, అది జైల్లో గడపాల్సిన వయస్సు కాదని పూనమ్ అన్నారు. 


సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉంటూ సేవలు అందించిన అనంతరం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ ఇలా జైలుకు వెళ్లాల్సి రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. జరుగుతున్న విషయాలపై తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా మానవత్వంతో స్పందిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు జైలు త్వరగా నుంచి విడుదల కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. పెద్ద వయసులో చంద్రబాబు జైల్లో ఉండటం ప్రపంచ వ్యాప్తంగా కలచి వేసిందని చెప్పారు.






మా కాళరాత్రి అమ్మవారిని పూజించే రోజున సౌమ్య రుద్ర రూపిణిగా కొలువైన విజయవాడ కనకదుర్గమ్మను పుట్టినరోజున దర్శనం చేసుకోవటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నిత్య జీవితంలో మహిళలు దుర్గమ్మ స్పూర్తితో ధృడ సంకల్పంతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణ ఆడబిడ్డలకు ఎక్స్(ట్విటర్) వేదికగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆచార, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక అని సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు.






అంతకుముందు భగవంత్ కేసరి సినిమా చూసినట్లు పూనం కౌర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. భగవంత్ కేసరి చూసినందుకు చాలా రిఫ్రెషింగ్‌ గా ఉందని, ఈ సినిమా చూశాక తాను కూడా జై బాలయ్య బ్యాచ్‌ లో చేరాలనుకుంటున్నానని ట్వీట్ చేశారు. ‘లడ్‌కీ కో షేర్ బనావో’ అంశం మనసును హత్తుకుందన్నారు. ఈ ట్వీట్ చూసిన వారంతా.. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.