Politics is growing in YS family around Viveka murder : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చుట్టూ వైఎస్ కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంలో మత ప్రచారకురాలిగా ఉన్న వైఎస్ వివేకా సోదరి, వైఎస్ షర్మిల, సునీతల మేనత్త విమలారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమెకు షర్మిల సూటిగా కౌంటర్ ఇచ్చారు.
షర్మిల, సునీతలపై వైఎస్ విమలారెడ్డి విమర్శలు
వైఎస్ వివేకా సోదరి విమలారెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో షర్మిల, సునీతపై విమర్శలు చేశారు. "మీరు చేస్తోంది తప్పు, ఇకనైనా నోరు మూసుకోండి.." అంటూ షర్మిల, సునీతపై వారి మేనత్త, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా ఆ ఇంటి ఆడపడుచునేనని, వైఎస్ ఇంటి ఆడపడుచులు ఆలా మాట్లాడడం సరికాదని చెప్పారామె. వివేకాను అవినాష్ చంపడం ఆ ఇద్దరూ చూశారా? అని నిలదీశారు. హంతకుడి మాటలు విని ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించారు. పైగా సీఎం జగన్‌ను కూడా ఇందులోకి లాగుతున్నారని, వ్యక్తిగత కక్షతోనే షర్మిల, సునీత ఇలా చేస్తున్నారని మండిపడ్డారు విమల. షర్మిలకు లీడర్షిప్ క్వాలిటీ లేదని అన్నారు విమల. కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్నానంటూ ఆమె అభ్యర్థించే వీడియో చూశానని, నిత్యం అవినాష్ ని విమర్శిస్తూ ఓట్లు అడగడం చూస్తే ఆమె ఏ పాటి లీడరో అర్థమవుతోందన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారని.. తమ పనులు కావట్లేదని, తమకు పెత్తనం ఇవ్వట్లేదనే కక్షతోనే షర్మిల, సునీత ఏకమయ్యారని, జగన్ ని టార్గెట్ చేస్తున్నారని అన్నారామె.
ఇంటి గౌరవాన్ని రోడ్డుకీడుస్తున్నారని విమర్శలు
ఇంటి ఆడపడుచులై ఉండి ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారని షర్మిల, సునీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు విమల. తమ కుటుంబంపై వారి ఆరోపణలు, మాటల్ని భరించలేకపోతున్నానని అన్నారు. హత్య చేసింది అవినాష్ అని వాళ్లిద్దరూ డిసైడ్ చేస్తే ఇక జడ్జీలు, కోర్టులు ఎందుకని ప్రశ్నించారు. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడని, అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా? అన్నారు విమల. అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారని, మరోవైపు హత్య చేసిన వాడు సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారని, వారిద్దరూ జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు విమల. ఇకనైనా నోరు మూసుకుని ఉండాలని హితవు పలికారు.
సీబీఐ బయట పెట్టిన ఆధారాలతోనే మాట్లాడుతున్నామని షర్మిల కౌంటర్
మేనత్త వైఎస్ విమలారెడ్డి చేసిన విమర్శలపై షర్మిల స్పందించారు. విమలమ్మ మాకు మేనత్త ..మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదన్నారు. వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు ..CBI చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నామని స్పష్టం చేశారు. ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది ..అందుకే మేము మాట్లాడుతున్నాంఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నామన్నారు. హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. విమలమ్మ కొడుకు కి జగన్ కాంట్రాక్టులు ఇచ్చారు ..ఆర్థికంగా బల పడ్డారు ..అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారన్నాపు, ఇక్కడ చనిపోయింది సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలని సూచించారు. వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయిందన్నారు. విమలమ్మ కి వయసు మీద పడింది.. అందులో ఎండా కాలం ..అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుందని సెటైర్ వేశారు.