Dharmavaram  :  ధర్మవరం పట్టణంలోని రోడ్లలో ఏర్పడిన గుంతలను తన సొంత ఖర్చులతో  పూడ్చేందుకు సిద్ధమైన  ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ను  అడ్డుకొని పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడి నుంచి పోతుకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఇచ్చిన అల్టిమేటం  సమయం పూర్తి కావడంతో మాజీ  ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ధర్మవరం పట్టణం లో  గుంతలను పూడ్చేందుకు సిద్ధమయ్యారు.  దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి  చుట్టుముట్టారు. సూర్య నారాయణ ఆయన తన అనుచరులతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజల మంచి కోసం పనులు చేయనివ్వరా? మంచి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ  ఆయన పోలీసులను ప్రశ్నించారు. అనంతరం అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.  ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలోఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.    


ధర్మవరం పట్టణంలో రోడ్లన్నీ గుంతల మయం 


ధర్మవరం పట్టణం రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి. ఆ రోడ్లలో ప్రయాణిస్తున్న వాహనదారులు, పాదచారులు తరచూ ప్రమాదానికి గురవుతున్నారన్న విహయం తన దృష్టికి వచ్చిందని.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యేగోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు.  తక్షణమే స్పందించిన ఆయన  గుంతలను పూడ్చే విషయంలో లేఖ ద్వారా స్థానిక రోడ్లు భవనాల శాఖ అధికారుల దృష్టికి గత నెల 16వ తేదీన  తీసుకెళ్లారు. మీరు ఆ గుంతలను పూడ్చలేని పక్షంలో  తనకు సమాచారం ఇస్తే  సొంత ఖర్చులతో  వాటిని పూడ్చివేస్తామని, అందుకు అనుమతినివ్వాలని  కోరారు. కొద్దిరోజులు గడిచినా అధికారుల నుంచి స్పందన లేదు.  స్థానిక అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ స్వయంగా రంగంలోకి దిగారు. జనవరి 24వ తేదీన నేరుగా ఆయన అనంతపురంలోని రోడ్లు భవనాధ శాఖ ఎస్ ఈ కార్యాలయానికి వచ్చారు. ఆయనను కలిసి సమస్యని వివరించారు. ధర్మవరం పట్టణ రోడ్లలో ఏర్పడిన గుంతలను వారంలోగా పూడ్చివేసే ప్రక్రియ ప్రారంభించాలని, లేనిపక్షంలో తన సొంత ఖర్చులతో వాటిని పూడ్చేందుకు  తాను సిద్ధమవుతానని అల్టిమేటం ఇచ్చారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో  గురువారం ధర్మవరంలోని గుంతలను పూడ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గుంతలను పూడ్చేందుకు అవసరమైన  సామగ్రిని తరలిస్తున్న సమయంలో  పోలీసుల అడ్డుకున్నారు. 


ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్న గోనుగంట్లు 


ప్రజల సమస్యలను, ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోదు... ఎవరైనా  వాటిని పరిష్కరిస్తామంటే  పోలీసులను ప్రయోగించి అడ్డుకోవడం పరిపాటిగా మారుతోందని  ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించక పోగా వాటిని పరిష్కరించేందుకు సిద్ధమైన తమను  అడ్డుకోవడం అనాగరిక చర్యగా ఆయన అభివర్ణించారు. ధర్మవరం పట్టణంలో ఏర్పడ్డ గుంతల ద్వారా ఎంతోమంది  గాయాల పాలయ్యారని గుర్తు చేశారు. ప్రజల ఇబ్బందులను విస్మరించి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి నిర్లక్ష్య ధోరణిని  అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం ధర్మవరంలోని రోడ్ల గుంతలను పూడ్చలేని  ఆయన... తాము అల్టిమేటం ఇచ్చి పనులు మొదలు పెట్టే సమయంలో  శంకుస్థాపనకు ముందుకు రావడం అతని నియంతృత్వ ధోరణికి అద్దం పడుతోందన్నారు. తనది ప్రజాపక్షం అని...  ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాను అన్నివేళలా సిద్ధంగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల స్పష్టం చేశారు.


రోడ్ల కాంట్రాక్ట్ తీసుకోవాలన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి 


ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే   ధర్మవరంలో నాలుగు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే సూరి ప్రచార ఆర్భాటం కోసమే హడావుడి చేస్తున్నాడని దుయ్యబట్టారు.. టీడీపీలో టికెట్ కోసం పరిటాల శ్రీరామ్ తో పోటీపడేందుకే సూరి రోడ్ల గుంతల మరమ్మత్తుల కార్యక్రమం జిమ్మిక్కు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచిందని తెలుసుకున్న తర్వాతే సూరి గుంతలు పూడ్చే కార్యక్రమంతో నాటకాలు ఆడుతున్నారని ఫైర్‌ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణకు దమ్ముంటే గుంతలు పూడ్చడం కాదు.. నాలుగు కోట్ల రూపాయల టెండర్లు ఇప్పిస్తాను రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి అంటూ సవాల్‌ చేశారు. ఇక, 4 వేల కోట్ల రూపాయిల అవినీతి అంటున్నాడు.. అందులో 10 శాతం ఇస్తే నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాను అని బహిరంగా సవాల్ విసిరారు. మరో రెండు నెలలో ఎన్నికలు వస్తాయనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.