Satyavedu Constituency Poltical History: చిత్తూరు (Chittor).. ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది ఆధ్యాత్మికం. ఏడుకొండల వెంకటేశుడు సహా కాణిపాకం వినాయకుడు, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కొలువైన జిల్లా. నిరంతరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే ఈ జిల్లాలో రాజకీయాలు సైతం అంతే ఆసక్తిగా ఉంటాయి. చిత్తూరుకు తూర్పు, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో 2022లో ఈ జిల్లాలోని భాగాలను కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలో కలిపారు. 2022, ఏప్రిల్ 4న పునర్వ్యవస్థీకరణ అనంతరం 31 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్లతో ఉంది.
ఆరుసార్లు టీడీపీ విజయం
ఇక, ఈ జిల్లాలోని ప్రముఖ నియోజకవర్గం సత్యవేడులో (Satyavedu) రాజకీయ ముఖచిత్రాన్ని ఓసారి చూస్తే ఇక్కడ 1962 నుంచి ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థి కె.ఆదిమూలం మెజార్టీ విజయం సాధించి రికార్డు సృష్టించారు. 1962లో తొలిసారి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి టి.బాలకృష్ణయ్య.. సమీప స్వతంత్ర అభ్యర్థి కె.మునిస్వామిపై 251 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1967లో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి కటారి మునిస్వామి.. కాంగ్రెస్ అభ్యర్థి టి.బాలకృష్ణయ్యపై 9,257 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 1972లో కాంగ్రెస్ తరఫున సి.దాస్ బరిలో నిలవగా.. తన సమీప ప్రత్యర్థి డీఎంకే పార్టీ అభ్యర్థి శిఖామణిపై 19,732 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత, 1978లోనూ కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్.. జనతా పార్టీ అభ్యర్థి వై.గంగాధరంపై 12,427 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, 1983లో టీడీపీ అభ్యర్థి తలారి మనోహర్.. కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్ గెలుపు జోరుకు బ్రేక్ వేశారు. ఆసారి 13,065 ఓట్ల మెజార్టీతో మనోహర్ గెలిచారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఎమ్.సురాజన్.. కాంగ్రెస్ అభ్యర్థి వై.రామారావుపై గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దాస్.. టీడీపీ అభ్యర్థి తలారి మనోహర్ పై 15,668 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక, 1994లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఎమ్.సురాజన్.. కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిపై 29,005 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1999లోనూ టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్.. కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిపై 6,659 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2004 నుంచి..
ఇక, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కె.నారాయణ స్వామి.. టీడీపీ అభ్యర్థి ఎన్.శివప్రసాద్ పై 31,492 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి హెచ్.హేమలత.. కాంగ్రెస్ అభ్యర్థి కె.నారాయణ స్వామిపై 9,691 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య.. వైసీపీ అభ్యర్థి కె.ఆదిమూలం 4,227 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కె.ఆదిమూలం.. టీడీపీ అభ్యర్థి జె.డి.రాజశేఖర్ పై 44,744 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. మరి, ఈసారి ఎన్నికల్లో సత్యవేడు ప్రజలు ఎవరికి పట్టం కడతారో.. ఏ పార్టీకి అండగా ఉంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.!
Also Read: Nellore News: నెల్లూరు జిల్లాలో విష జ్వరాల విజృంభణ - ప్రజల ఆందోళన