Guntur Tdp Rally : చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా గుంటూరులో టీడీపీతో పాటు ఇతర ప్రజాసంఘాలు చేపట్టిన శాంతి ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నామని నిరసనలకు అనుమతి లేదని పోలీసులు శాంతి ర్యాలీని అడ్డుకున్నారు. టీడీపీ నేతల్ని ఉదయం నుంచి ఎక్కడిడక్కడ హౌస్ అరెస్టు చేశారు.  అయితే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయకుండా తెదేపా, జనసేన, సీపీఐ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు.   శాంతిర్యాలీ నిర్వహించకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఉదయం నుంచి గుంటూరులో ఉద్రిక్తంగా ఉంది.  





 


గుంటూరులోని లాడ్జి సెంటర్ నుంచి శాంతి ర్యాలీ ప్రారంభించాలనుకున్నారు. అందుకే ఆ సెంటర్ వైపు వెళ్లే దారులన్నీ మూశారు. వందల మంది పోలీసుల్ని మోహరించినప్పటికీ.. లీడర్లందర్నీ హౌస్ అరెస్టు చేసినప్పటికీ  చంద్రబాబు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పోలీసు వలయం ఛేదించుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నక్కా ఆనంద్‌బాబు, జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌, జనసేన నేత శ్రీనివాస్‌ యాదవ్‌, పెద్ద ఎత్తున మహిళా రైతులు పాల్గొన్నారు. 





 


ముందస్తు పిలుపు మేరకు లాడ్జి సెంటర్‌కు చేరుకున్న కార్యకర్తలు శాంతి ర్యాలీ నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. లాడ్జిసెంటర్‌ నుంచి అరండల్‌పేట వరకు సుమారు 800 మంది పోలీసులు మోహరించి.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని కార్యకర్తలు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.లాడ్జి సెంటర్‌ నుంచి మార్కెట్‌ వద్ద ఉన్న హిమని సెంటర్‌ వరకు శాంతి ర్యాలీ చేస్తామని టీడీపీ నాయకులు.. ఎస్పీని కలిసి  అనుమతి కోరారు. కానీ పోలీసులు శుక్రవారం అనుమతి నిరాకరిస్తున్నట్లుగా ప్రకటించారు.  ర్యాలీకి రావొద్దని రాజకీయ పార్టీల నేతలకు నోటీసులు అందజేశారు.  [ 





 


పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా శాంతి ర్యాలీ జరుగుతుందని  ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని నక్కా ఆనంద్ బాబు ప్రకటించారు. ఈ ర్యాలీకి  పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం.. వచ్చిన వారిపై దురుసుగాప్రవర్తించడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. శాంతియుత నిరసనలు చేసే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుందని పోలీసుల తీరుపై కోర్టుకెళ్తామని ప్రకటించారు.