Gold Seized In Pithapuram: ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, బంగారం పట్టుకుంటున్నారు. తాజాగా, కాకినాడ జిల్లా పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. గొల్లప్రోలు (Gollaprolu) టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ మినీ ట్రక్కులో రూ.17 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో వీటిని సీజ్ చేసి కాకినాడలోని జిల్లా ట్రెజరీ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వీటిని విశాఖ నుంచి కాకినాడకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కాకినాడకు చెందిన పలు ప్రముఖ జ్యువెలరీ షాపులకు ఈ ఆభరణాలు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. కాగా, జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై అందరి ఫోకస్ ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఏ చిన్న విషయం జరిగినా హాట్ టాపిక్ గా మారుతోంది.
మరోవైపు, తెలంగాణలోనూ పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport) సమీపంలో శుక్రవారం భారీగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా.. ఓ కారులో 34 కేజీల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు తరలిస్తున్నట్లు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలు ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు చెప్పారు.