Case On Somu Veerraju : ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధి నిర్వహణను అడ్డుకుని దౌర్జన్యం చేసినందుకు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బుధవారం ఉదయం కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద భారీ కంటెయినర్ పెట్టి సోము వీర్రాజు కారును పోలీసులు అడ్డుకున్నారు. వారితో వాగ్వివాదానికి దిగిన బీజేపీ నేత తన దారికి అడ్డు తప్పుకోవాలంటూ పోలీసులను తోసేశారు. దీంతో పోలీసులకూ, సోము వీర్రాజుకు మధ్య కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతను పోలీసులు వీడియో చిత్రీకరించారు.
అమలాపురం అల్లర్ల బాధితులను పరామర్శించేందుకు రావులపాలెం నుంచి జొన్నాడ జంక్షన్ వైపు వెళ్తుండగా సోమువీర్రాజు కారుని పోలీసులు నిలిపేశారు. 144 సెక్షన్ అమల్లో ఉందని వెళ్లడానికి లేదన్నారు. ఆయనను అడ్డుకునేందుకు కారుకు ముందు కంటెయినర్ నిలపడంతో ఆయన వాహనానికి దారి లేదు. తాను ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్తున్నానని, అయినా మీరు నన్ను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలంటూ పోలీసులను సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని, శాంతియుతంగా వెళ్లే వారిని అడ్డుకోదని చెప్పగా పోలీసులు వినిపించుకోకపోవడంతో వారిని పక్కకు తోసేసి డ్రైవర్ వద్దకు వెళ్లారు.
వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరిచ్చారని సోము వీర్రాజు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని ఉద్రిక్త పరిస్థితులను నిర్మాణం చేయదలచుకోలేదని ఎస్పీ స్థాయి అధికారికి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆంక్షలెందుని ప్రశ్నించారు. కార్యకర్తలు కుటుంబాన్ని పరామర్శిస్తుంటే పోలీసు శాఖ ద్వారా ఈ దుందుడుకు చర్యలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన, అసమర్ధతను బయటపెడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రభుత్వ నిఘా వర్గాలకు కూడా తెలియని స్థాయికి జగన్ పాలన దిగజారిందనే విషయాన్ని మీ చర్యలు అద్దం పడుతున్నాయంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోము వీర్రాజు పోలీసులపై దౌర్జన్యం చేస్తున్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు సాయంత్రం న్యాయసలహా తీసుకుని రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే గతంలో ఇంత కంటే దారుణంగా మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసుల్ని తిట్టారని కానీ ఆయనపై కేసులు నమోదు చేయలేదని.. బీజేపీ నేతుల గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలకు వర్తించని చట్టం సోము వీర్రాజుకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు.