Police are giving shock treatment to YSRCP activists: రాజకీయ ఉన్మాదంతో ఓ వైసీపీ కార్యకర్త గర్భిణిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో టపాసులు కాల్చవద్దని కోరినందుకు, ఏడు నెలల నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెపై భౌతిక దాడికి దిగి కడుపుపై తన్నిన వైసీపీ కార్యకర్త అజయ్ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జగన్ పుట్టినరోజు వేడుకల పేరుతో సాగించిన ఈ అరాచకంపై విస్తృత ప్రచారం జరగడంతో పోలీసులు అరెస్టు చేశారు.
ఆదివారం గ్రామంలో వైసీపీ శ్రేణులు బాణసంచా కాలుస్తూ, పెద్ద ఎత్తున కేకలు వేస్తూ హంగామా చేశారు. ఈ క్రమంలో గర్భిణి అయిన సంధ్యారాణి ఇంటి వద్ద భారీ శబ్దాలతో బాంబులు పేలుస్తుండటంతో, ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. శబ్దాల వల్ల తనకు ఇబ్బందిగా ఉందని, కొంచెం పక్కకు వెళ్లి కాల్చుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే, కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన నిందితుడు అజయ్ దేవ్, ఆమెపై దాడికి దిగి జుట్టు పట్టుకుని లాగడమే కాకుండా.. అత్యంత కర్కశంగా ఆమె కడుపుపై కాలితో తన్నాడు.
తీవ్ర రక్తస్రావం , గాయాలపాలైన సంధ్యారాణిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న గర్భిణి పరిస్థితి చూసి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అజయ్ దేవ్ కోసం గాలించి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై, ముఖ్యంగా గర్భిణీపై ఇటువంటి అరాచకానికి ఒడిగడితే సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం నాడు కదిరి పట్టణంలో ప్రధాన వీధుల గుండా డిపించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నేరస్థుల్లో భయం కలిగించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక గర్భిణిపై ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే మూగజీవాలను బలి ఇచ్చి ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన ఘటనలో... అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి సర్పంచ్ ఆదినారాయణరెడ్డి సహా నిందితులను కళ్యాణదుర్గం కోర్టుకు వీధుల్లో నడిపించుకుని తీసుకెళ్తారు.
రప్పా రప్పా నరికేస్తామని ఓ చోట టెస్త్,ఇంటర్ పిల్లలు ఫ్లెక్సీలు పెట్టారు. పోలీసులు వారి భవిష్యత్ దృష్ట్యా పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలి పెట్టారు.