MLA Balaraju Sudden Inspection In ITDA Office: ఆయన ఓ ఎమ్మెల్యే. ఎలాంటి ఆర్భాటం లేకుండా సోమవారం ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడ విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి మొబైల్‌లో పబ్జీ గేమ్ ఆడుతూ కనిపించాడు. ఇంకేముంది.. సదరు ఉద్యోగిపై చర్యలు చేపట్టాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేను చూసిన అక్కడి ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.. సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం కన్నాపూరం ITDA ఆఫీసుని తనిఖీ చేశారు. ఎలాంటి సెక్యూరిటీ, ఆర్భాటం లేకుండా సాధారణ వ్యక్తిలా మాస్కు పెట్టుకుని ఆయన ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు.


పబ్జీ ఆడుతూ ఉద్యోగి






ఈ సమయంలో అక్కడ సాయికుమార్ అనే ఉద్యోగి విధులను వదిలేసి హాయిగా కుర్చీలో కూర్చుని మొబైల్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. ఎమ్మెల్యేను చూసిన ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఉద్యోగి పబ్జీ గేమ్ ఆడడం చూసిన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసారు. అత‌డిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అతనికి షోకాజ్ నోటీసులిచ్చి వివరణ అడగాలని అభిప్రాయపడుతున్నారు.


నిత్యం ఆక‌స్మిక త‌నిఖీలు


ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి చిర్రి బాల‌రాజు నిత్యం ప్ర‌భుత్వ కార్యాల‌యాల త‌నిఖీలు చేపడుతున్నారు. ఆయ‌న ఇప్ప‌టికే 
గురుకుల పాఠ‌శాల, ప్రభుత్వ ఆస్ప‌త్రుల‌ను త‌నిఖీ చేశారు. ఇటీవ‌ల కొయ్యలగూడెం మండల కేంద్రంలో గవర్నమెంట్ ఆస్పత్రిని ఆక‌స్మికంగా తనిఖీ చేశారు. ఆస్ప‌త్రి పరిసరాలు, ల్యాబ్‌లను, మెడికల్ కిట్స్‌ను ఆయ‌న పరిశీలించారు. అనంత‌రం ప్ర‌జ‌ల‌కు అందుతున్న సేవ‌ల ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. వైద్య సిబ్బంది బాధ్య‌త‌ల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా ఉన్నార‌ని అసహనం వ్యక్తం చేశారు. ప్రాథమిక చికిత్స స‌రిగా జ‌ర‌గడం లేదు, ఒపీ రికార్డ్స్ సరిగా లేవ‌ని ప్రశ్నించారు. ఇలాంటివి మరోసారి పున‌రావృతం అయితే ఇంటికే ప‌రిమితం చేస్తాన‌ని సిబ్బందిని హెచ్చరించారు. 


అటు, బుట్టాయగూడెం మండ‌లంలోని బుసరాజుపల్లి గిరిజన బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సైతం ఎమ్మెల్యే త‌నిఖీ చేశారు. భోజన సమయంలో పాఠ‌శాల‌కు వెళ్లిన ఎమ్మెల్యే క్లాస్‌ రూమ్స్, వంటశాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, ఎలాంటి అవకతవకలు రాకుండా జాగ్రత్తగా పని చేయాలని ఆదేశించారు. సమస్యలపై ఐటీడీఏ పీవో సూరతేజతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.