PM Modi offers prayers at Veerbhadra Temple in Lepakshi Andhra Pradesh పెనుకొండ: ప్రధాని నరేంద్రమోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. తన పర్యటనలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని మోదీ (PM Narendra Modi). అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి లేపాక్షి ఆలయాని (Lepakshi Temple)కి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంగా స్వామి వారికి హారతి ఇచ్చిన ప్రధాని మోదీ.. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీరామ్ జైరామ్ అంటూ భజన పాటలు సైతం భక్తి భావంతో పాడారు. ఈ సందర్భంగా లేపాక్షి ఆలయ విశిష్టతను అర్చకులు ప్రధాని మోదీకి వివరించారు. ఆలయం ప్రాంగణంలో సీతారాముల విశేషాలను తెలిపేలా తోలుబొమ్మలాటల రూపంలో రామాయణంను ప్రదర్శించారు.
ఆలయంలో గల వీరభద్ర స్వామి, దుర్గాదేవి, ఏడు శిరస్సుల నాగేంద్రుడు, ఏకశిలా నంది విగ్రహం, వేలాడే స్తంభం, విరుపన్న రక్త చాయలు, అర్ధాంతంగా ఆగిన కళ్యాణ మండపం, సీత దేవి పాదం, నాట్య మండపంలో రాతి స్తంభాల పై చెక్కిన వివిధ రూపాల దేవతామూర్తుల శిల్పాలను ప్రధాని మోదీ వీక్షించారు. దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో లేపాక్షి దేవాలయం చాలా అద్భుతంగా ఉందని ఇక్కడ ఉన్న చిత్ర ,శిల్పాలు చూడడానికి చూడముచ్చటగా ఉన్నాయని ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఆలయం వెలుపలికి వచ్చిన అనంతరం ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం తెలియజేస్తూ పెనుగొండ నియోజకవర్గం పాలసముద్రం గ్రామంలోని నాసిక్ అకాడమీ ప్రారంభించేందుకు బయలుదేరారు.
లేపాక్షి సందర్శన అనంతరం గోరంట్ల (Gorantla)మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన నాసిన్ కేంద్రం ( National Academy of Customs, Indirect Taxes and Narcotics)లో నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లాలో మొత్తం ఆరు హెలిప్యాడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఐదు వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. నాసిన్ కేంద్రంలో ప్రధాని మోడీ గంటన్నర పాటు ఉండనున్నారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ఇంటరాక్ట్ అవుతారు.
ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం పుస్తకాన్ని ఆవిష్కరణ
పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌లోని యాంటీక్యూస్ స్మగ్లింగ్ స్టడీ సెంటర్‌ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్‌ను సందర్శిస్తారు. తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని పరిశీలిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎక్స్–రే, బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి, అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడనున్నారు. 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. బహిరంగసభలో మాట్లాడిన తర్వాత ఢిల్లీకి వెళతారు.