PM Modi Swearing Ceremony: మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన ప్రమాణ స్వీకార వేడుక ఘనంగా జరిగింది. ప్రధానితో పాటు దాదాపు 72 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మ ఎన్డీఏ కూటమి నేతలతోపాటు ప్రతిపక్ష పార్టీల అధినేతలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు..  పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి క్యాబినెట్లో స్థానం లభించింది.  తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి టీడీపీ ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు క్యాబినెట్ బెర్త్‌ దక్కింది.  


అత్యధిక మెజార్టీతో గెలిచిన పెమ్మసాని 
పెమ్మసాని చంద్రశేఖర్ నరేంద్ర మోదీ నేతృత్వంలోని నూతన ఎన్డీయే ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కూటమి అభ్యర్థిగా గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు.  ఈ ఎన్నికల్లో  పెమ్మసాని చంద్రశేఖర్ 3.4 లక్షల మెజార్జీతో వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై విజయఢంకా మోగించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీల్లో పెమ్మసాని చంద్ర శేఖర్ ఒకరు. ఎన్నికల అఫిడివిట్‌లో వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం దేశంలోనే ధనవంతుడైన ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ పేర్గాంచారు. తెలంగాణకు చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హర్యానాలోని కురుక్షేత్ర నుంచి గెలిచిన నవీన్ జిందాల్ లాంటి వారిని దాటి ధనవంతులైన ఎంపీల్లో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. ఎన్నికల బరిలో దిగిన తొలిసారే ఘన విజయం సాధించారు పెమ్మసాని. ఆయన ప్రస్తుతం 18వ లోక్ సభలో అడుగుపెట్టడంతో పాటు ఏకంగా నరేంద్ర మోదీ మంత్రివర్గంలోనూ ఛాన్స్ దక్కించుకున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజక వర్గం నుంచి గెలిచిన తొమ్మిదో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. 


పెమ్మసాని ఎవరంటే ? 
గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో పెమ్మసాని జన్మించారు. ఆయన తండ్రి పేరు సాంబశివరావు. చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించిన ఆయన అప్పట్లో ఏపీ ఎంసెట్, ఇంటర్మీడియట్‌లో  రాష్ట్ర స్థాయి ర్యాంకర్‌గా నిలిచారు. 1999లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లి అక్కడ పెన్సిల్వేనియాలో ఇంటర్నల్ మెడిసన్‌లో డాక్టర్ ఆఫ్ మెడిసన్(ఎండీ) 2005లో పూర్తిచేశారు. ఆయన భార్య శ్రీరత్న కూడా డాక్టరే. ‘యూవరల్డ్’ అనే ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం ప్రారంభించి ప్రస్తుతం దానికి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 


సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిన వర్మ
  నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించింది.  మోదీతో పాటు  ఆయన కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.  భూపతిరాజు శ్రీనివాస వర్మ ఏపీ బీజేపీలో సీనియర్ నేత.  1988లో బీజేపీ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1992-95లో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పని చేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు సార్లు  ఆ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో భీమవరం మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్‌గా గెలిచారు. అనంతరం ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గా పని చేశారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా విజయం సాధించారు.  శ్రీనివాసవర్మ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు.