Elections 2024 : పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలు ఆయనను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బుధవారం ఆయనను సంగారెడ్డి వద్ద ఓ ఫ్యాక్టరీలో అరెస్టు చేశారన్న ప్రచారం జరిగింది. కానీ అరెస్టు చేయలేదని త్వరలో పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఆయన విదేశాలకు వెళ్లిపోయారని .. వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారని రక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఆయన నర్సరావుపేట కోర్టులో లొంగిపోతారన్న సమాచారం పోలీసులకు రావడంతో కోర్టు వద్ద పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.
పిన్నెల్లి అరెస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పోలీసులు
మాచర్ల నియోజకవర్గంలోని పాలవాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవీఎం ను పిన్నెల్లి పగులగొట్టినట్లుగా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీసీ కెమెరా వీడియోలు వైరల్ కావడంపై ఏ వన్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చేర్చారు. అప్పటికే ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అరెస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పలు బృందాలు హైదరాబాద్ లోని ఆయన నివాసం, బంధువుల నివాసాల్లోసోదాలు నిర్వహించారు. ఆయన బుధవారం ఉదయం సంగారెడ్డి వైపు వెళ్తున్నట్లుగా తెలుసుకుని పోలీసులు ఛేజ్ చేశారు. కానీ ఆయన తప్పించుకుని వెళ్లారు.
కోర్టులో లొంగిపోవాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా ప్రచారం
అయితే ఇలా తప్పించుకోవడం కన్నా కోర్టులో లొంగిపోతే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తప్పించుకుని పోతే ఎన్నో రోజులు ఆజ్ఞాతంలో ఉండలేరని తర్వాతైనా న్యాయపరమైన పరిష్కారం చూసుకోవాల్సి ఉంటుంది. పరారీలో ఉన్నారన్న ప్రచారం జరగడం కన్నా.. లొంగిపోయి బెయిల్ కోసం ప్రయత్నించడం మంచిదని ఆయనకు శ్రేయోభిలాషులు, వైసీపీ పెద్దలు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నర్సారవుపేట కోర్టులో లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఈ విషయం పై పోలీసులకు సమాచారం రావడంతో కోర్టు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
లొంగిపోకపోతే అరెస్టు కోసం మరిన్ని ప్రత్యేక బృందాలు
పల్నాడులో ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. సీఈసీ కూడా పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించింది. ఆయన పరారీలో ఉన్నారని రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తామని డీజీపీ నివేదిక పంపించారు. పిన్నెల్లి నర్సరావుపేట కోర్టులో లొంగిపోకపోతే పోలీసులు తమ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించే అవకాశం ఉంది. ఆయన ఎన్ని రోజులు పరారీలో ఉంటే కేసీఆర్ ఆయనకు వ్యతిరేకంగా అంత బలంగా మారుతుందని న్యాయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు.