"పెగాసస్"  ఇప్పుడు దేశంలో అత్యధికంగా చర్చనీయాంశమవుతున్న పదం. మనకు వ్యక్తిగత స్వేచ్చ... అనేదే లేకుండా చేసే స్పై సాఫ్ట్ వేర్. దీన్ని దేశంలో విచ్చలవిడిగా వాడుతున్నారన్న విషయం ఇప్పుడు.. సంచలనం రేపుతోంది. రోజుకొకటి చొప్పున బయటకు వస్తున్న వ్యవహారం ప్రభుత్వాల మెడలకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు.  "పెగాసస్"ను ప్రభుత్వాలకు .. అదీ కూడా ఉగ్రవాదులపై నిఘా పెట్టడానికి మాత్రమే అనుమతిస్తామని ఇజ్రాయెల్ సంస్థ చెబుతోంది. కానీ ఇండియాలో జరిగింది మాత్రం వేరు. రాజకీయ ప్రత్యర్థులందర్నీ...  టార్గెట్ చేశారు. జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలను సేకరించారు. పెగాసస్ వ్యవహారంపై తమపై వస్తున్న ఆరోపణలకు కేంద్రం భుజాలు తడుముకుంటున్నట్లుగా ఉంది. చట్టాలన్నీ కఠినంగా ఉన్నాయని దేశంలో.. చట్ట విరుద్ధంగా ఎలాంటి నిఘా ఉండదని... కబుర్లు చెబుతున్నారు. కానీ ఆ సాఫ్ట్‌వేర్‌ను ఇండియాకు తీసుకొచ్చి వాడతున్నారా లేదా అన్నదాన్ని మాత్రం చెప్పడం లేదు.  
 
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకానేక ఘటనలు వెలుగు చూశాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో.. మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు మోడీ ఫోన్ చేసి.. టీషర్టులో ఉన్నారెందుకని హెచ్చరించారన్న ప్రచారం జరిగింది. ఇంటలిజెన్స్ సమాచారం ఏమో అని అప్పుడు అనుకున్నారు. కానీ అసలు విషయం పెగాసస్ అని.. ఇప్పుడిప్పుడే అనుమానాలు బయలుదేరుతున్నాయి. ప్రభుత్వాలను గద్దెదించడానికి, నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి పెగాసస్‌తో నిఘాను బీజేపీ ఉపయోగించుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వం కూల్చివేతలో ఈ నిఘా ఉపయోగిపడినట్లుగా ఇప్పటికే మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అనేక ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూల్చి వేసింది. నేతల్ని.. తమ వైపునకు తిప్పుకుంది. తమ పార్టీలో చేరేలా చేసుకుంది. ఇదంతా..  వారి వారి వ్యక్తిగత జీవితాల్లోని విషయాలను తెలుసుకుని..  బ్లాక్ మెయిల్ చేయడం ద్వారానే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    
కొన్నాళ్ల క్రితం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టి.. తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ అప్పుడు అక్కడి ప్రభుత్వం ఆడియో టేపులు రిలీజ్ చేసింది. అందులో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వాయిస్ ఉంది. ఈ టేపులు ఎలా వచ్చాయో.. ఎవరికీ క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు పెగాసుస్ అన్సర్ చెబుతోంది. కానీ అక్కడ ఈ సాఫ్ట్ వేర్ వాడింది.. కేంద్రం కాదు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కావొచ్చు. ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో ట్యాపింగ్ .. నిఘా ఆరోపణలు అనేక రాష్ట్రాల్లో వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నిఘా వ్యవహారం చాలా సార్లు కలకలం రేపింది. 
  
ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులపైనే నిఘా పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.  ఈ నిఘా అంశం చాలా సీరియస్ అంశమని ప్రకటించిన హైకోర్టు.. విచారణ కూడా చేస్తోంది.  ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించారని లాయర్ శ్రావణ్ కుమార్ ప్రత్యేకంగా అఫిడవిట్ దాఖలు చేశారు. తెలంగాణలో ఓ సారి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వాయిసే బయటకు వచ్చింది. ఇంకా చాలా ఆడియోలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కానీ తర్వాత వెలుగులోకి రాలేదు. ఇప్పటికీ.. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి లాంటి నేతలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. 


ఈ పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో ఎంత మందిపై నిఘా పెట్టారు.. ఎంత మంది సమాచారం సేకరించారు.. వాటిని ఏ విధంగా ఉపయోగించారు అంశాలు బయటకు వస్తే.. కేంద్రంతో పాటు.. అనేక రాష్ట్రాలు కుప్పకూలే పరిస్థితి ఉంది. అందుకే విచారణకు కాదు కదా.. కనీసం.. ఆ పరిశీలన కూడా ప్రభుత్వాలు చేసే అవకాశం లేదంటున్నారు.