పెగాసస్ స్పై సాఫ్ట్‌వేర్ వ్యవహారం ఇప్పుడు ప్రపంచం మొత్తం దుమారం రేపుతోంది. ఇండియాలో జరిగిన అనేక కీలక రాజకీయ పరిణామాలకు.. ఈ పెగాసుస్‌కు సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. గత కొంత కాలంగా పడిపోయిన ప్రభుత్వాలు.. పార్టీలు మారిన అనేక మంది నేతలు.. తమ సీక్రెట్లు ఇతరులకు తెలియడంతో.. వాటి నుంచి రక్షణ కోసమే... పార్టీలు మారినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ప్రముఖులు పెగాసుస్ బాధితులేనని అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నిఘా అనేది ఎప్పుడూ వివాదాస్పదం అవుతూనే ఉంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఓటుకు నోటు కేసును పట్టుకున్న వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎంత పక్కాగా పట్టుకున్నారంటే... రేవంత్ రెడ్డి రూ. యాభై లక్షలతో సెబాస్టియన్ ఇంటికి వస్తున్నాడని తెలిసి.. అన్ని కోణాల్లోనూ.. సినిమా సన్నివేశాన్ని చిత్రకరించే స్థాయిలో నాలుగైదు కెమెరాలను ఏర్పాటు చేశారు. పక్కా సమాచారం దొరకకపోతే అది సాధ్యం కాదు. అప్పుడే ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపింది. అప్పుడు ఈ పెగాసిస్ సాఫ్ట్‌వేర్ గురించి ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు.
ఇక రాజకీయ నాయకుల వ్యూహాలను అధికార పార్టీ నేతలు తెలుసుకోవడానికి నిబంధనలకు విరుద్ధంగా ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది నేతలు పార్టీలు మారారు. దానికి కారణం.. వారి వ్యక్తిగత రహస్యాలు... అధికార పార్టీలకు చేరడమేనని చెబుతున్నారు. ఏపీలో అయితే ఈ నిఘా ఆరోపణలు.. తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఏకంగా హైకోర్టు న్యాయమూర్తుల మీదనే నిఘా పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై శ్రవణ్ కుమార్ అనే లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టుల న్యాయమూర్తుల మీద నిఘా పెట్టడానికి ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించారని ఆయన ఆరోపించారు. ఆ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది.
అలాగే ఇటీవల.. ఏపీ అధికార పార్టీ కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. అవి కూడా పెగాసుస్ సాయంతో క్యాప్చర్ చేసినవేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో... ఈ స్పై విధానాన్ని చాలా ఎక్కువగా వాడారని.. అనేక మంది టీడీపీ నేతలు.. ఎన్నికల్లో పోరాడకుండా సైలెంట్ అవడానికి అదే కారణం అని చెబుతున్నారు. పెగాసస్‌పై విచారణ అంటూ జరిగితే.. తెలుగు రాష్ట్రాల్లో దాని బారిన పడిన వారి వివరాలు కూడా వెలుగులోకి వస్తాయి. అలాగే చేయించిన వారి వివరాలూ వెలుగులోకి వస్తాయి. అప్పుడు రాజకీయంగా పెను సంచలనాలు ఖాయమని చెప్పుకోవచ్చు.