Pcc Chief Sharmila Meets Ex Minister Konathala : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల జోరు పెంచారు. రాజకీయంగా పార్టీని గాడిలో పెట్టేందుకు ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాలు వారీగా పర్యటన ప్రారంభించిన ఆమె.. కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలను పెంచేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం వైఎస్‌ షర్మిల విశాఖలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సన్నిహితంగా మెలిగిన వారిలో రామకృష్ణ ఒకరు. వైఎస్‌ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆ తరువాత వైసీపీలోనూ కొన్నాళ్లపాటు పని చేశారు. రాజకీయంగా జగన్‌తో విబేధించిన ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ కోసం, రైల్వే జోన్‌ కోసం తనదైన శైలిలో పోరాటాన్ని సాగించారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు తన వంతు ప్రయత్నాలను సాగించారు. గడిచని కొన్నాళ్లుగా రాజకీయంగా సైలెంట్‌ అయిన కొణతాల రామకృష్ణ కొద్దిరోజులు కిందటే జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షర్మిల ఆయనతో భేటీ కావడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. 


20 నిమిషాలకుపైగా సమావేశం.. 


విశాఖ నగరంలోని కొణతాల రామకృష్ణ ఇంటికి మంగళవారం రాత్రి పీసీసీ అధ్యక్షురాలు షర్మితోపాటు మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు ఇతర నాయకులతో కలిసి వెళ్లారు. మొదట లాబీలో అందరితో కలిసి మాట్లాడిన ఆమె.. ఆ తరువాత రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజుతో కలిసి ఏకాంతంగా కొణతాలతో చర్చలు జరిపారు. రాజకీయంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులతోపాటు కాంగ్రెస్‌లో చేరికపై వీరి మధ్య చర్చలు జరిగాయి. కానీ, రాజకీయంగా మాట్లాడామే తప్పా.. పార్టీలో చేరిక గురించి చర్చించలేదని ఇరువురు నేతలు బయటకు వచ్చి ప్రకటించారు. కానీ, వీరి కలయిక ఇటు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతోపాటు జనసేన పార్టీలోనూ కలకలం సృష్టించింది. 


అందుకే వచ్చానని చెప్పిన షర్మిల


కొణతాల రామకృష్ణతో సమావేశం అనంతరం బయటకు వచ్చిన షర్మిల మీడియాతో మాట్లాడారు. నాన్నతో కొణతాల అంకుల్‌ పని చేశారనని, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ఇంటికి వచ్చినట్టు తెలిపారు. అందరూ మాట్లాడుకున్నట్టుగానే రాజకీయాలు మాట్లాడామని, అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా మీడియాతో మాట్లాడారు. మేనమామ ఇంటకి వచ్చినట్టుగా షర్మిల వచ్చారని స్పష్టం చేశారు. తాను ఇది వరకే జనసేనలో చేరుతున్నట్టు స్పష్టం చేశానని, ఇందులో మార్పు లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ తనకు ముఖ్యమని, వైసీపీ పాలన అంతమొందించడం జనసేన, టీడీపీ కూటమికే సాధ్యమన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్‌ పూర్తిగా విఫలమయ్యారని, పోలవరం, సుజల స్రవంతి, స్టీల్‌ప్లాంట్‌ వంటి అనేక అంశాల్లో రాష్ట్రానికి ప్రయోజనం కలిగించడంలో జగన్మోహన్‌రెడ్డి విఫలమయ్యాడన్నారు. 


కీలక పరిణామంగానే భావించాలి.. 


షర్మిల, కొణతాల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది సాధారణ భేటీ అని ఇరువురూ చెబుతున్నప్పటికీ.. షర్మిల వెళ్లి కలవడం వెనుక రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోకి కొణతాలను ఆహ్వానించేందుకే షర్మిల ఇంటికి వెళ్లారు. అయితే, కొణతాల నుంచి సానుకూల స్పందన వచ్చిందీ, రానిదీ తెలియాల్సి ఉంది. ఇప్పటికే జనసేనలో చేరుతున్నట్టు కొణతాల ప్రకటించడం వల్ల వెనక్కి తగ్గే అవకాశం లేదు. కానీ, షర్మిల ఒత్తిడి, మాజీ సహచరులు రఘువీరారెడ్డి, రుద్రరాజు వంటి వారి సూచనలు ఎంత వరకు షర్మిల చర్చలకు దోహదం చేస్తాయో చూడాల్సి ఉంది.