Andhra Politics : ఏపీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడంపై పవన్ కల్యాణ్ సంతృప్తి వ్యక్తం చేశారు.  ఆంధ్రప్రదేశ్   అసెంబ్లీ ఎన్నికల్లో  చూపించిన ప్రేమకు మనస్పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ లేఖ విడుదల చేశారు.  సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం , అభివృద్ది , శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు. అత్యధికంగా 81.86% ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా అభినందించారు.  


పిఠాపురం ప్రజలకు ప్రత్యేక లేఖ 


పిఠాపురం అభ్యర్ధిగా పోటీ చేసిన నన్ను ఆదరించి అండగా నిలిచి మీరు చూపించిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ పవన్ మరో లేఖ విడుదల చేశారు.  పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను అని ప్రకటించగానే స్వచ్చందంగా తరలివచ్చి మీ కుటుంబ సభ్యుడిగా భావించి పని చేయడం ఎంతో ఆనందం కలిగించింది. నిన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాత్రి 10 గంటల సమయం వరకూ  పోలింగ్ లో పాల్గొని రికార్డ్ స్థాయిలో 86.63 శాతం ఓటింగ్ నమోదు అవ్వడం అనేది మీ ప్రేమను తెలియజేస్తుంది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన సైనికులు, టిడిపి, బిజేపి కార్యకర్తలు వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు. 


వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు                        


 పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని తెలియగానే ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ తన సీట్ త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పిఠాపురం టిడిపి ఇంచార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ గారికి, వారి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు పవన్.  ఈ ఎన్నికల్లో వర్మ  అందించిన సహకారం మరువలేనిదన్నారు.  భవిష్యత్తులో కచ్చితంగా ఆయన చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరపున బలంగా పని చేస్తారని నమ్ముతున్నాను. అలాగే రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ది కోసం వర్మ గారి అనుభవం వినియోగించుకుంటూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామన్నారు.  


ప్రచారం చేసిన  వారికి ధన్యవాదాలు 


పిఠాపురంలో నేను పోటీచేస్తున్నాను అని తెలియగానే తమ సినీ కుటుంబ సభ్యుడికి అండగా ఉండేందుకు తమ సినిమాలు, ధారావాహిక లకు గ్యాప్ ఇచ్చి ముందుకు వచ్చి పిఠాపురంలో ప్రతీ గడపకు వెళ్ళి ప్రచారం చేసిన సినీ, బుల్లి తెర నటీ, నటుల ప్రేమ నన్ను కదిలించిందని పవన్  తెలిపారు.  నా విజయం కాంక్షిస్తూ ఎంతోమంది అగ్ర కథానాయకుల నుంచి, నవతరం నటుల వరకు అందరూ మద్దతు ప్రకటించడం సంతోషాన్నిచ్చింది. ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాననన్నారు.  అలాగే దేశ విదేశాల నుండి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తరలివచ్చి తమ మాతృభూమి అభివృద్ధి ఆకాంక్షను వెల్లడించిన ఎన్నారై జనసైనికులకు నా అభినందనలు . పిఠాపురంలో మార్పుకు ముందడుగు వేసేందుకు పనిచేసిన ప్రతీ ఒక్క నాయకుడికి   పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని మాటిచ్చారు.