Pawan Kalyans younger son mark shankar injured in fire accident | ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. 

పవన్ కల్యాణ్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆయనకు సమాచారం అందించిన అధికారులు పర్యటన రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. ‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు తాను మాట ఇచ్చానని… ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటానని  పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అక్కడి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని జనసేనాని తెలిపారు. మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్  విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖ ఎయిర్ పోర్టు  నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్, జనసైనికులు ఆందోళన..

పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజెనోవా రష్యాలో జన్మించారు. ఆమె రష్యాలో మోడ‌లింగ్ చేశారు. అనంతరం సినిమాల్లోకి వచ్చిన ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013 సెప్టెంబరు 30న వివాహం చేసుకున్నారు.  ఆమె అనామకురాలు కాదు. ఆమెకు రష్యా, సింగపూర్ దేశాల్లో ఆస్తులు ఉన్నాయి. ఆమెకు దాదాపు రూ.1800 కోట్లు విలువ‌ చేసే ఆస్తులు ఉన్నాయని సమాచారం. పవన్, అన్నా లెజెనోవా దంపతులకు సంతానం ఇద్దరు పిల్లలు కాగా, పాప పోలేనా అంజనా పవనోవా, అబ్బాయి మార్క్ శంకర్ చిన్నవాడు. ఈ బాలుడు స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.