Babu Pawan Kalyan :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో సమవేశం అయ్యేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ నేడు (గురువారం) రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు- ఈ ముగ్గురు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. దాంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. గురువారం ఉదయం 10 గంటలకు పవన్, బాలకృష్ణ రాజమండ్రికి చేరుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదివరకే తొలి దఫా ములాఖత్ లో సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణిలు చంద్రబాబును కలిసి మాట్లాడుకున్నారు. న్యాయం గెలుస్తుందని, త్వరలో తాను జైలు నుంచి బయటకు వస్తానని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పడం తెలిసిందే.


చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని.. కుట్ర పూరితంగా ఈ చర్యలు తీసుకున్నారని పవన్ కల్యాణ్ అంటున్నారు. చంద్రబాబుకు గట్టిగా మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుతో భేటీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తూండటం రాజకీయంగానూ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున పవన్ కల్యాణ్ .. ప్రభుత్వం కుట్ర పూరిత అరెస్టును ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. అదే  రోజు ఆయన విజయవాడ రావాల్సి ఉండగా ఆయన విమానానికి అనుమతించవద్దని పోలీసులు ఎయిర్ పోర్టుకు లేఖ రాశారు. దాంతో ఆయన ఫ్లైట్‌లో విజయవాడ రాలేకపోయారు.                    


రోడ్డు మార్గం ద్వారా వస్తూంటే ఆయనను అడ్డుకునే  ప్రయత్నం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆయనను అదుపులోకి తీసుకుని తామే స్వయంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో వదిలి పెట్టారు. చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన రోజున మీడియాతో మాట్లాడి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేబినెట్  భేటీలో ఆమోదించి.. చట్టబద్దంగా ఖర్చు పెట్టిన ఓ వ్యవహారంలో ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేశారని.. తాము వచ్చాక ఎలా వదిలి పెడతామని ప్రశ్నించారు.  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వారం రోజులకు వాయిదా పడటం.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయకపోవడంతో.. ఆయన జైల్లోనే ఉండనున్నారు. దీంతో ఆయనకు సంఘిభావం ప్రకటించేందుకు జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.                        


ఇటీవలి కాలంలో రాజకీయంగా రెండు పార్టీల మధ్య అనుబంధం మరింత పెరిగింది. వైఎస్ఆర్‌సీపీ అరాచకాలపై, అక్రమాలపై గట్టిగా కలసి పోరాడతామని ప్రకటించారు. లోకేష్‌కు ఫోన్ చేసి ముందుగానే సంఘిభావం తెలిపారు. అదే సమయంలో.. లోకేష్ కూడా పవన్ కల్యాణ్ కూడా అన్నలాగా అండగా ఉన్నారని.. తాను ఒంటరి వాడిని కాదని చెప్పారు. ఈ పరిణామాలన్నింటితో టీడీపీ, జనసేన మధ్య బంధం మరింత ధృడపరిచేలా చేసిందని అంటున్నారు. నిజానికి ఈ రెండు పార్టీలు ఇంకా సీట్ల సర్దుబాటు చేసుకోలేదు. అధికారికంగా పొత్తులు ప్రకటించలేదు. అయినప్పటికీ రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి.