Varahi Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖలో వారాహియాత్రను జగదాంబ సెంటర్‌లో బహిరంగసభను నిర్వహించడం ద్వారా ప్రారంభించారు. మరో వారం పాటు విశాఖలోనే వారాహియాత్ర సాగుతుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి షెడ్యూల్ ఖరారు చేసుకుంటారు.
వారాహి యాత్ర ఎక్కడెక్కడంటే ?
వారాహియాత్ర శనివారం పెందుర్తి నియోజకవర్గంలో జరుగుతుంది. వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ పరామర్శిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సి.ఎన్.బి.సి. ల్యాండ్స్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. తర్వాత ఆదివారం వారాహి విజయ యాత్రలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 14వ తేదీన సోమవారం ఉదయం 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు వెళ్తారు. అక్కడ ఆక్రమణకు గురైన భూములను పరిశీలిస్తారు. 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 16వ తేదీ బుధవారం విశాఖ నగరం భీమిలి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బలను సందర్శిస్తారు. 17వ తేదీ గురువారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. 18వ తేదీన జరిగే కార్యక్రమాల వివరాలను తర్వాత ప్రకటిస్తారు.
విజయవంతానికి ప్రత్యేక జాగ్రత్తలు
పవన్ వారాహి యాత్రను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్ శుక్రవారం విశాఖపట్నం ముఖ్య నేతలతో భేటీ నిర్వహించి కార్యక్రమాలను సమీక్షించారు. జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా అభినందించారు. పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ పై చర్చించారు.
విద్వేష ప్రసంగం చేశారని పవన్‌కు ఇప్పటికే పోలీసులు నోటీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో భాగంగా గురువారం జరిగిన సభలో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ పవన్ కల్యాణ్ కు నోటీసులు అందించారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని.. పవన్ ఇలా వ్యవహరించి ఉండకూడదని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.