Gollaprolu bridge : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను రికార్డు సమయంలో నెరవేర్చారు. గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్ధగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని శనివారం ఆయన సందర్శించారు. గత సెప్టెంబర్ నెలలో వరదల సమయంలో పడవపై వెళ్లి కాలనీ వాసుల కష్టాలను స్వయంగా చూసిన పవన్ కళ్యాణ్, అప్పట్లోనే వంతెన నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం కేవలం కొద్ది నెలల్లోనే రూ. 3.05 కోట్ల అంచనా వ్యయంతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయించి, నేడు దాని నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
ఈ పర్యటనలో భాగంగా వంతెనపై కలియతిరిగిన పవన్ కళ్యాణ్, అధికారుల నుంచి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు సుద్ధగడ్డ కాలువ పొంగిపొర్లి హౌసింగ్ కాలనీ వాసులు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడేవారు. కనీసం నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా పడవలే దిక్కయ్యే పరిస్థితి నుంచి, నేడు శాశ్వత వంతెన సౌకర్యం కల్పించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, నిర్మాణంలో ఎక్కడా నాణ్యత లోపించకూడదని గతంలోనే ఆదేశించిన మేరకు పనులు జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
సంక్రాంతి పండుగ వేళ ఈ వంతెన అందుబాటులోకి రావడం కాలనీ వాసుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం, శనివారం పవన్ కళ్యాణ్ పరిశీలనకు రావడంతో కాలనీ వాసులు, పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యను పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించారని ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి ఉంటే పనులు ఎంత వేగంగా జరుగుతాయో గొల్లప్రోలు వంతెన నిర్మాణం నిరూపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వరద ముంపు బాధితుల గోడు విన్న నాయకుడిగా, వారి ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసినందుకు పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో అభివృద్ధిని పరుగులు తీయించడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.