Pawan kalyan: విశాఖపట్నం జిల్లా సమీపంలోని అచ్యుతాపురం సెజ్ లో విష వాయు లీకేజీ విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఎస్ఈజెడ్ పారిశ్రామిక ప్రాంతంలో తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. విష వాయువు లీకై 125 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవడం దురదృష్టకరం అని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలను ప్రభుత్వం అరికట్టలేదా అంటూ ప్రశ్నించారు. 


నెలక్రితం 400 మంది ఇప్పుడు 125 మంది..


ఇదే కంపెనీలో నెల క్రితమే ఇటువంటి ప్రమాదం జరిగి 400 మంది అస్వస్థతకు గురయ్యారని.. మళ్లీ అదే ఘటన పునరావృతమైందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటో అటు అధికారులు గానీ... ఇటు కంపెనీ ప్రతినిధులుగా చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పరవాడ, దువ్వాడ. అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టు పక్కల కాలనీవాసులు, గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని... ఏ విష వాయువు ప్రాణాలు తీస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారని అన్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో... ఎంత మంది ప్రాణాలను హరించిందో ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని పరిశ్రమల్లో పక్కా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. తద్వారా ప్రమాదాలను నివారించాలని సూచించారు.



మేలైన వైద్యం, నష్ట పరిహారం అందించాలి..


"ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి, కర్మాగాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరవాడ, దువ్వాడ, అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల చుట్టు పక్కన కాలనీవాసులు, గ్రామస్తులు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో, ఏ విష వాయులు ప్రాణాలు తీస్తుందో అని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాష్ట్రం, దేశ ప్రగతికి పరిశ్రమలు, ఎంతో అవసరం. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ ప్రగతి ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలను ఫణంగా పెట్టి కాదు. 


పారిశ్రామిక ప్రమాదాలు నివారణకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలసికట్టుగా పని చేయాలి. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ పకడ్బందీ చేపట్టాలి. ఆరోగ్యకరమైన పారిశ్రామిక ప్రగతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి తావులేని విధంగా పని చేయాలి. ఎటువంటి వైఫల్యం ఎదురైనా అందుకు ప్రభుత్వంలోని పెద్దలు బాధ్యత వహించాలి. దుస్తుల కర్మాగారం వాయి ప్రమాదంలో అస్వస్తులైన మహిళా కార్మికులకు ప్రభుత్వం  మేలైన వైద్యాన్ని, నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు." అని జనసేనాని తెలిపారు.