YSRCP MPs Ration :   రేషన్ కేటాయింపుల్లో ఎపీకి కేంద్రం అన్యాయం చేస్తోంద‌ని  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లు మండి పడ్డారు.  60 శాతం మందికే కేంద్రం బియ్యం పంపిణీ జ‌రుగుతుంద‌ని, బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తోంద‌న్నారు.  ప్రజా పంపిణీ, ఆహార భద్రతా పథకాల కింద రాష్ట్రానికి పంపిణీ చేస్తున్న బియ్యానికి, కేంద్రం చెబుతున్న లెక్కలకు అసలు పొంతన లేదని ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు.  రాష్ట్రంలోని పేద ప్రజల్లో గందరగోళ పరిస్థితిని సృష్టించారు. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు.  ఒకవేళ ప్రింటింగ్‌ మిస్టేక్‌ పడిందా? లేక మరొకటా అనే దానిపై కేంద్ర మంత్రిని కలిసి స్పష్టత కోరతామన్నారు. 


రేషన్ లెక్కలపై కేంద్రం తప్పుడు సమాచారం


కేంద్రం ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల ప్రజలలోకి  తప్పుడు సంకేతాలు వెళతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే డోర్ డెలివరీ విధానం తెచ్చి,  ప్రజల గడప వద్దకు వెళ్ళి రేషన్‌ పంపిణీ చేస్తోందని మార్గాని భరత్ గుర్తు చేశాు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి, ఈ విధానాన్ని దేశంలోని మిగతా కొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఎక్కడా  అవినీతికి తావులేకుండా నేరుగా లబ్దిదారుల ఇళ్ల వద్దకే సరుకులు అందిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ ,ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారని అన్నారు.


ఏపీ విధానం దేశానికే ఆదర్శం 


ఏపీలో బీపీఎల్ కు దిగువున ఒక కోటి 54 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి.  అయితే, కేంద్రం 89లక్షల కార్డుదారులకు మాత్రమే బియ్యం కేటాయిస్తుంది. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 56 లక్షల కార్డుదారులకు బియ్యం అందిస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 3వేల కోట్లు పేదలకు ఖర్చు చేస్తోంది. బియ్యం కోటా పెంచాలని,  ముఖ్యమంత్రి  పలుమార్లు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి విజ్జప్తి చేశారన్నారు.   ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అత్యంత పకడ్బందీగా,  అవినీతికి తావు లేకుండా, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, పక్కదారి పట్టకుండా నేరుగా నిరుపేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని, ఇతర నిత్యావసర సరుకులను అందిస్తున్నారుని ఎంపీ వంగా గీత స్పష్టం చేశారు.


నాలుగున్నర కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నాం : వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు


రాష్ట్రంలోని అయిదున్నర కోట్ల జనాభాలో సుమారు నాలుగున్నర కోట్లమందికి ... అంటే రాష్ట్ర జనాభాలో 80శాతం మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు అందిస్తున్నామని వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు స్పష్టం చేసారు.  పార్లమెంట్లో సాధారణంగా తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉండదు. అయితే క్లరికల్‌ మిస్టేక్‌, ఇన్‌ఫర్మేషన్‌ అందించడంలో తప్పు కావచ్చు, లేక ఈ మూడేళ్ల కాలుక్యులేషన్‌లో సమాచార లోపం వల్ల కావచ్చు, కేంద్రం కొంత తప్పుడు సమాచారాన్ని పార్లమెంటులో ఇచ్చిందని విమర్శించారు.