ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చంద్రబాబు అరెస్టు కావడంపై పర్యటక శాఖ మంత్రి రోజా తన నివాసంలో సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవ్వడమే కాక, చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. ఒకరి చావు లేదా అరెస్టు అనే పరిణామాలు సంతోషకరమైనవి కావని, అవి వేడుక చేసుకొనే విషయాలు కావని అన్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో కూడా తాను చాలా బాధ పడ్డానని అన్నారు. అప్పుడు తాను కొమరం పులి షూటింగ్‌లో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. జగన్ కూడా గతంలో 16 నెలలు జైలులో ఉన్నప్పుడు కూడా తాను తటస్థంగా ఉన్నానని అన్నారు. ఆ విషయాలు తెలుసుకొని తాను సైలెంట్‌గా ఉన్నానని అన్నారు. అలాంటిది 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి జైలులో పెడితే అది సంబరం చేసుకొనే విషయం ఎలా అవుతుందని మంత్రి రోజాను ఉద్దేశించి మాట్లాడారు. అలా చేస్తే వాళ్ల దిగుజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
జనసేన - టీడీపీ పొత్తు ఖరారు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. జగన్ రెడ్డి యుద్ధానికి సిద్ధమంటే.. తాము కూడా సిద్ధమేనని ప్రకటించారు. గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నామని.. అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకే వచ్చానని సగటు మనిషి వేదన జనసేన ఆవిర్భావ సభలోనే మాట్లాడానన్నారు.
ఇవాళ ములాఖత్ ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైనది . వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసే వెళ్తాయని.. ఇది మా ఇద్దరి భవిష్యత్తు కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని ప్రకటించారు. వైసీపీని సమిష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు రాజకీయనేత... జగన్ ఆర్థిక నేరస్థుడన్నారు. సైబరాబాద్ నిర్మించిన, హైటెక్ సిటీ సృష్టించిన వ్యక్తిని జైల్లో పెట్టడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే తన ఆకాంక్ష అనతి.. వైసీపీ నేతలు మాపై రాళ్లు వేసే ముందు ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. రాళ్లు వేసిన ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. వైసీపీ పాలనతో మునిగిపోయామని.. అధికారులు జగన్ ను నమ్ముకుంటే.. కుక్కతోకను పట్టుకుని గోదారి ఈదినట్లేనని హెచ్చరించారు.
తాను తీసుకున్న నిర్ణయాలు కొందరికి ఇబ్బందిగా ఉంటాయని.. దక్షిణాది నుంచి మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తిని తానేనన్నారు. దేశానికి బలమైన నాయకుడు కావాలని అనుకున్నానని మోదీకి మద్దతు తెలిపిన సమయంలో నన్ను అందరూ తిట్టారన్నారు. కానీ ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గననని స్పష్టం చేశారు. ఏ రోజు వెళ్లినా కూడా మోదీ పిలిస్తేనే వెళ్లానని ఆ స్థాయి నాయకుల సమయం వృథా చేయననన్నారు.