Pawan Kalyan : హిట్లర్ నిఘా వ్యవస్థ లాగా జగన్ వాలంటీర్ వ్యవస్థ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అందర్నీ అనట్లేదు కానీ కొందరు వాలంటీర్లు ప్రజలను పరోక్షంగా భయపెడుతున్నారని ఆరోపించారు. కొందరు వాలంటీర్ల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నరు. ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సమాంతరంగా ఇంకో వ్యవస్థను నడపడం కేవలం ప్రజలను కంట్రోల్ చేయడానికేనన్నారు. వాలంటీర్లు సేకరించే సమాచారంతో రాష్ట్రంలో ఏ మూలన వైసీపీ వ్యతిరేకులు ఉన్నారో జగన్ గమనిస్తున్నాడు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవాడని గుర్తు చేశారు. ఇది వాలంటీర్లు కూడా గమనించి నడుచుకోవాలని సూచించారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలుపై దుమారం రేగుతున్నా .. తన వాదనకే పవన్ కల్యాణ్ కట్టుబడ్డారు.
వాలంటీర్లపై శ్రమదోపిడి
వాలంటీర్ వ్యవస్థపై తనకు కోపం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారి నుంచి శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పారు. ఏపీని తట్టి లేపుతున్నానని.. ఇందుకోసం తాను చనిపోయేందుకు సిద్ధం అని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. 30 వేల మంది మహిళలు మిస్ అయితే సమస్య కాదా అని అడిగారు. ఎవరు ఎవరితో తిరిగారు.. ఎవరు ఎవరితో పడుకున్నారా..? ఇవా సమస్యలా..? అని నిలదీశారు. ఏపీని పట్టి పీడిస్తోన్న జలగ జగన్ అని విమర్శించారు. జగన్ ఫ్యాక్షనిస్ట్ అని, అతని మనస్తత్వం మారలేదని విమర్శించారు. అతను ఎప్పుడూ విప్లవకారుడితో గొడవ పెట్టుకోలేదని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ అనే వాడు విప్లవకారుడు అని తెలిపారు. మీకు మీరు మద్దతు ఇచ్చుకోవాలని.. మీ బిడ్డలను.. ఆడబిడ్డలను సంరక్షించుకోవాలని సూచించారు. వాలంటీర్లపై హైకోర్టు వేసిన కొన్ని ప్రశ్నల వీడియోను పవన్ కల్యాణ్ షేర్ చేశారు.
వైసీపీ నేతల మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందన్న పవన్
వైసీపీ నేతలు అనే మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. తనను, తన కుటుంబ సభ్యులను నిందించొచ్చు.. కానీ తాను అలా అనని పేర్కొన్నారు. జగన్ సంస్కార హీనుడు అని.. అతను చదువుకోలేదని విమర్శించారు. తాను రోజుకు రూ.2.5 కోట్లు సంపాదించగలనని.. ఏడాదికి కనీసం 200 రోజులు పనిచేస్తే రూ.400 కోట్లు సంపాదిస్తానని పవన్ కల్యాణ్ వివరించారు. ఇవన్నీ వదలుకొని, మీ కోసం వచ్చానని.. సమస్యలపై పోరాడుతున్నానని తేల్చిచెప్పారు.
దెందులూరులో పార్టీ కార్యకర్తలతో సమావేశం
వైసీపీ పార్టీ జగన్ ది కాదని, వేరే వాళ్ల దగ్గర నుంచి ఆ పార్టీని తీసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి యాత్ర (Varahi Yatra) నిర్వహిస్తున్న ఆయన మంగళవారం ఏలూరు జిల్లా, దెందులూరులో వీర మహిళలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల పొట్టగొట్టి, శ్రామికులను దోచుకున్న పార్టీ వైసీపీ అని విమర్శించారు. పబ్లిక్ పాలసీ రూపొందించడం అంత తేలికకాదన్నారు. ఉదాహరణకు కొల్లేరేనని.. పర్యావరణాన్ని రక్షించాలనుకుంటే, కొల్లేరుపై ఆధారపడిన రైతులు దెబ్బతింటారని.. రైతులను ఆదుకుందామంటే పర్యావరణం దెబ్బతింటుందని పవన్ కల్యాణ్ అన్నారు. సినిమాల్లో డ్యాన్స్ చేయవచ్చు, ఇంకా ఏమైనా చేయవచ్చు.. కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదన్నారు. తానేంటో నిరూపించుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.