Pawan Kalyan Comments in Mangalagiri: ఏపీకి ఇక చీకటి రోజులు ముగిశాయని.. ఈ విజయం ఎంతో చారిత్రకమైందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆకాశమంత విజయం ఇచ్చిన తాను ఇకపై 5 కోట్ల మంది ఏపీ ప్రజల కోసం పని చేస్తామని చెప్పారు. 2019లో ఓడిపోయినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నానని అన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గెలిచిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఈ విజయంతో వైసీపీని భవిష్యత్తులో తాము ఇబ్బంది పెట్టబోమని అన్నారు. ఇది కక్ష్య సాధింపు సమయం కాదని.. ఏపీ అభివృద్ధికి పునాదులు వేసే సమయం అని అన్నారు. ఇకపై ప్రతి ఒక్కరూ బాధ్యతో పని చేయాలని పిలుపు ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు.


వైసీపీని ఇబ్బంది పెట్టడానికి వచ్చిన విజయం కాదు ఇది. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు పునాది వేయడం కోసం వచ్చిన విజయం ఇది. నా జీవితంలో ఇంత వరకు విజయం అనేది తెలీదు. సినిమాల్లో తొలి ప్రేమతో మొదటి విజయం చూశాను. ఆ తర్వాత ఏ సినిమా విజయం సాధించిందని, డబ్బులు వచ్చాయని ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు 21కి 21 సీట్లు గెలిచే వరకూ నాకే తెలియదు ఈ విజయం వస్తుందని. దేశంలో వందకి వందశాతం కొట్టిన పార్టీ జనసేనే.