AP Latest News: విజయవాడ వరదలకు అతలాకుతలం అయిన వరద బాధితులకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన శక్తి మేర ప్రయత్నిస్తు్న్న సంగతి తెలిసిందే. అంతేకాక, ప్రముఖులు సైతం తమ వంతుగా విరాళాలను ప్రకటిస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు రూ.కోట్లలో, రూ.లక్షల్లో విరాళాలను ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్లకు అందజేస్తున్నారు. అంతేకాక, పౌరులు కూడా సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.


ఆ ఖాతాకు సామాన్య పౌరులు కూడా తమకు తోచిన విధంగా విరాళాలను పంపిస్తున్నారు. కానీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు మాత్రం.. ఆయన పంపిన విరాళం అందర్నీ ఆకట్టుకుంటోంది. రోజూ పని చేస్తేగానీ ఇల్లు గడవని స్థితిలో ఉన్న ఆయన తన కష్టార్జితాన్ని సీఎం సహాయ నిధికి పంపించారు. తన రోజువారీ జీతం రూ.600 కు సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టు చేసి తెలిపారు. గుడవర్తి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రూ.600 పంపుతున్నట్లు పోస్ట్ చేశారు. ఆదివారం తనకు పని ఉందని, ఆ పని చేస్తే ఇంకా డబ్బు వస్తుందని తెలిపారు. ఆ డబ్బు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపుతానని గుడవర్తి సుబ్రహ్మణ్యం తెలిపారు.






‘‘ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ రూ.600 విజయవాడ వరద బాధితులకు ఏపీ సీఎం సహాయ నిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది.. ఆ డబ్బులు కూడా పంపిస్తాను నాకు స్ఫూర్తి పవన్ కల్యాణ్ గారు.. కష్టాలన్నవి అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది.’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


దీనిపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ‘‘రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుంచి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ. నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయనిధికి సుబ్రహ్మణ్యం గారు అందించిన 600 రూపాయలు చాలా విలువైనవి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పవన్ రిప్లై ఇచ్చారు.