Free Higher Education to Pithapuram 10th Toppers: పిఠాపురం నియోజకవర్గాన్ని కేవలం రాజకీయంగానే కాకుండా, విద్య , సామాజిక రంగాల్లో ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన నియోజకవర్గ విద్యార్థులపై ఆయన వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 580 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు వారి ఇష్టానుసారం ఉన్నత విద్యను ఉచితంగా అందించేలా పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్నారు.
అభిరుచికి తగ్గట్టుగా కోర్సుల ఎంపిక
ఈ పథకం కింద ఎంపికైన 31 మంది విద్యార్థులలో ఒకరు 598 మార్కులతో రాష్ట్రస్థాయిలోనే అగ్రస్థానంలో నిలిచారు. కేవలం సీట్లు ఇప్పించడమే కాకుండా, విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో మాట్లాడి.. వారికి ఏ కోర్సుపై ఆసక్తి ఉంది? ఏ కళాశాలలో చేరాలనుకుంటున్నారు? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారి అభీష్టం మేరకే ప్రముఖ విద్యాసంస్థల్లో ఉచిత అడ్మిషన్లు కల్పించారు. పవన్ కళ్యాణ్ పిలుపునకు స్పందించి, పిఠాపురం విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ముందుకు వచ్చిన విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సొంత జీతం నుంచి సాయం.. ఇప్పుడు విద్యా దానం
పవన్ కళ్యాణ్ ఇప్పటికే మానవత్వాన్ని చాటుకుంటూ, తల్లిదండ్రులు లేని భగవంతుని పిల్లలకు తన నెలవారీ జీతం నుంచి 5,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ సాయం పొందుతున్న వారిలో ఏడుగురు విద్యార్థులు పదో తరగతిలో అద్భుత మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ కార్యచరణను సిద్ధం చేశారు.
లక్ష్యం.. పిఠాపురం ప్రగతి
పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా ఎదగాలి అన్నదే తన ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యార్థులకు శుభాశీస్సులు అందజేస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలు నియోజకవర్గవ్యాప్తంగా హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధి అంటే కేవలం అభివృద్ధి పనులు చేయడమే కాకుండా, ఒక తరాన్ని నిర్మించే బాధ్యత తీసుకోవాలని ఆయన మరోసారి నిరూపించారు.
