Pawan Kalyan:  తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  ఏపీలో  టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. జూన్ 12న నాలుగో సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), మంత్రులుగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan)  తో సహా తదితరులు ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ ఎన్నికల గెలుపులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. అంతేకాదు పోటీ చేసిన అన్ని స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి ఆ పార్టీ 100 శాతం స్ట్రైయిక్ రేట్ నమోదు చేసింది.  చంద్రబాబు కేబినెట్లో జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించారు. జనసేన అధినేతకు డిప్యూటీ సీఎం పోస్టు ఖరారైంది. దాంతో పాటు  ఇంకా ఏ శాఖలు కేటాయిస్తారో అన్న దాని పై స్పష్టత వచ్చింది. పవన్ కోరిక మేరకు  కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.


అభినందనల వెల్లువ
రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్‌ కల్యాణ్‌కు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అభినందనల వర్షం కురుస్తోంది.  భారీ మెజార్టీతో గెలవడంతో పాటు మంత్రి పదవి దక్కడంతో ఆయనను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఆయనను ఓ సారి చూడాలని ప్రయత్నిస్తున్నారు. దీనిపై తాజాగా పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. త్వరలోనే తనే స్వయంగా జిల్లాలవారీగా వచ్చి పార్టీ శ్రేణులు, అభిమానులను కలుస్తానంటూ ప్రకటించారు. 






ధన్యవాదాలు తెలుపుతూ లేఖ
తనను పిఠాపురం నియోజకవర్గం నుంచి 70వేల భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు, గెలిచిన తర్వాత.. అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభినందనలు చెబుతున్న వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ప్రజా జీవితంలో ఉన్న  మేధావులు, నాయకులు, నిపుణులు, సినీరంగం ప్రముఖులు, యువత, రైతులు ఇలా అందరూ నాకు అభినందనలు చెబుతున్నారు. ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే జిల్లాల వారీగా పర్యటించి అందరినీ కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’అని పవన్‌ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు.  


20న పిఠాపురంలో పర్యటన
తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 20న నియోజకవర్గంలో పర్యటిస్తానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. నియోజకవర్గ ప్రజలు, స్థానిక కార్యకర్తలను తనే స్వయంగా వచ్చి కలుస్తానన్నారు. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానంటూ చెప్పుకొచ్చారు.