పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా రేపు (ఫిబ్రవరి 25వ తేదీన) విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే తెలంగాణలో ఈ సినిమాకు టిక్కెట్ ధరలకు పెంపు, అదనపు ఆటలకు అనుమతులు లభించాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నియమాలను కఠినతరం చేస్తూ అన్ని థియేటర్లకు నోటీసులు పంపించారు.
భీమ్లా నాయక్ సినిమాకు అదనపు ఆటలకు కానీ, టిక్కెట్ ధరల పెంపునకు కానీ అనుమతులు లేవని... జీవో నం.35 ప్రకారం రేట్లు అమలు చేయకపోతే థియేటర్లను సీజ్ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదలకు కొన్ని గంటలకు ముందు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ప్రముఖ జర్మన్ వేదాంతి పాస్టర్ మార్టిన్ నిమొల్లర్ తెలిపిన మాటలను ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘మొదట వారు సోషలిస్టుల కోసం వచ్చారు. అప్పుడు నేను మాట్లాడలేదు... నేను సోషలిస్టును కాదు కాబట్టి. ఆ తర్వాత వారు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను మాట్లాడలేదు... ఎందుకంటే నేను ట్రేడ్ యూనియనిస్టును కాదు కాబట్టి. ఆ తర్వాత వారు యూదుల కోసం వచ్చారు. అప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నేను యూదుడిని కాదు కాబట్టి. చిట్టచివరికి వారు నాకోసం వచ్చారు. అప్పుడు నాకోసం మాట్లాడటానికి ఎవరూ లేరు.’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇప్పుడు తనకు తలెత్తిన సమస్య తర్వాత మిగతావారికి కూడా వచ్చే అవకాశం ఉందని ఇన్‌డైరెక్టుగా చెప్పకనే చెప్పినట్లుంది. గతంలో సాయిధరం తేజ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కల్యాణ్ ఇవే మాటలు చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ ఇన్‌డైరెక్ట్‌గా ఏపీ ప్రభుత్వం తీరు మీద కూడా ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే విషయంపై మాట్లాడినందుకు నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకు కూడా ఏపీలో ఇబ్బందులు ఎదురయ్యాయి. నియమాలను కఠినంగా అమలు చేసేలా స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ వేసిన ట్వీట్ నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.