Delhi Pawan Kalyan :   జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో వరుసగా సమావేశం అవుతున్నారు.  ఏపీలో క్రమంగా ఎన్నికల వాతావరణం నెలకొంటున్న పరిస్థితుల్లో పవన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.  పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ ఇన్చార్జి మురళీధరన్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. గంటపాటు  వీరి మధ్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కూడా పవన్ కలిసే అవకాశముంది. సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఇంకా కీలకమైన సమావేశాలు జరగాల్సి ఉందని అవి పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తానన్నారు.                           


అయితే పవన్ కల్యాణ్ ను కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ఒప్పించేందుకే ఢిల్లీకి పిలిచినట్లుగా ప్రచారం జరుగుతోంది..   కర్ణాటక ఎన్నికల్లో విజయం కోసం ఉన్న అవకాశాలన్నింటినీ వాడుకోవాలని చూస్తోంది భారతీయ జనతాపార్టీ. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని కూడా ప్రచారంలోకి దించాలని భావిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఈ స్నేహంతోనే కర్ణాటకలో ప్రచారం చేయాలని రిక్వస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.                     


ఉత్తర కర్ణాటకలో చాలా వరకూ తెలుగు ప్రాబల్యమే ఎక్కువ. బళ్లారి దగ్గర మొదలుపెట్టి రాయచూరు, సింధనూరు, గంగావతి, దవణగిరి, గుల్బర్గ, బీదర్ వరకూ అయితే ఆంధ్రా, లేదంటే తెలంగాణ సెటిలర్స్ ది కీలక వర్గం. మరి ఆ తెలుగు ఓట్లను ప్రభావితం చేసేలా స్టార్ క్యాంపెయినర్ గా పవన్ ఉపయోగపడతారు అనేది బీజేపీ భావన. అందుకే ఆయన్ని స్టార్‌ క్యాంపెయినర్‌గా దించాలని బీజేపీ ప్లాన్ గా చెబుతున్నారు. అయితే ముందుగా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తో సమావేశం కావడంతో  ఏపీ రాజకీయాలపైనా చర్చ జరిగినట్లుగా భావిస్తున్నారు. 
 


2014 జనరల్ ఎలక్షన్స్ టైమ్‌లో జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్‌లో ఉన్నాయి. అప్పుడు ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పవన్ కల్యాణ్‌ కర్ణాటక ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ప్రభావితమయ్యేలా ఉద్వేగభరిత ప్రసంగాలను చేసి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మేలు చేశారు. 2019 ఎలక్షన్స్ టైమ్ నాటికి బీజేపీ, టీడీపీల దోస్తానాకు కట్ చెప్పిన పవన్ కల్యాణ్‌, వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అంతకు ఏడాది ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ ప్రచారానికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా సైలెంట్ అయిపోయారు పవన్ కల్యాణ్‌. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి అంగీకరిస్తారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.