Nadendla Manohar X Post | అమరావతి: సరిగ్గా 7 సంవత్సరాల కిందట అక్టోబర్ 12, 2018న జనసేన పార్టీ (JanaSena Party)లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారితో తన ప్రయాణం ప్రారంభమైందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. పటిష్టమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఒక దార్శనికతతో నడిచారు. ఆయన సమర్థవంతమైన, ప్రజలపై దయ చూపే  నాయకత్వం ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో మనల్ని ప్రేరేపిస్తుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

Continues below advertisement


శ్రీకాకుళంలోని తిత్లీ తుఫాను (Cyclone Titli) తర్వాత, యువత వారి ఆకాంక్షలను ప్రతిబింబించే భవిష్యత్ ఏపీ కోసం వారి మాట వింటున్నాము. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాయకులు, జనసైనికులు, వీర మహిళా సంఘాలకు  కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ నాదెండ్ల మనోహర్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఆ ఫొటో గమనిస్తే నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో యువతతో మాట్లాడుతున్నారు. మధుర జ్ఞాపకాలను పోస్ట్ చేయగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు.






ఉచితాలు, సంక్షేమ పథకాలు అడగలేదు...
నాదెండ్ల మనోహర్ కొన్నేళ్ళ కిందట జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన పోస్టుపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత తమను ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు అడగటం లేదని.. తమ 25 సంవత్సరాల భవిష్యత్తు గురించి అడిగారని పవన్ కళ్యాణ్ తెలిపారు. 



పవన్ పోస్టులో ఏముంది..
‘ఆరోజు వారితో మేం జరిపిన సంభాషణ నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. వారు ఉచితాలను అడగ లేదు, ఎటువంటి సంక్షేమ పథకాలను అడగడం లేదు. తమకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలని కోరారు. మన యువత నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. వారి కలలను సాకారం చేయడానికి, వారిని అర్థం చేసుకోవడానికి తరచుగా యువతను కలుస్తూనే ఉంటానని’ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజా ధనం వృథా అవుతుందని, అయినా పథకాలు సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపిస్తుంది. అధికారంలోకి వచ్చిన పార్టీ తమ ఓటు బ్యాంకును నిలుపుకోవడానికి ఆర్థిక సంక్షోభం ఉన్నా ఒక్కో ఉచిత పథకం, సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ పోతుంది. అయితే ఉచితాలు సరికాదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా.. వారి కాళ్లపై నిలబడేలా అభివృద్ధి పథకాలు ఉండాలని కోర్టులు చెబుతుంటాయి. ఎన్నిసార్లు చర్చ జరిగినా ఉచితాల విషయంలో మాత్రం రాజకీయ పార్టీలు వెనక్కి తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికలు రాగానే మరో కొత్త పథకం ప్రకటిస్తున్నారు.