Pawan Kalyan felicitates blind women Cricket team for winning World Cup:  ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు.  మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.  ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించారు.  ఒక్కో క్రికెటర్ కీ రూ.5 లక్షల చొప్పున సాయం చేశారు.  శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళ క్రికెటర్ కీ పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు.

Continues below advertisement

మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని పవన్ కళ్యాణ్ కొనియాడారు.  అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.  ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారీణులు దీపిక , పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు. దీపిక జట్టు కెప్టెన్ గా ఉన్నారు.   

ఈ సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక తమ గ్రామ సమస్యలు తెలిపారు. ఆమె శ్రీ సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి   పవన్ కల్యాణ్  ఆదేశించారు.  అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారికి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు. ఆమెకు ఇల్లు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. 

అంధ మహిళా క్రికెటర్లు చూపిన అంకిత భావం, పడిన కష్టం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. వారు సాధించిన విజయం భారత క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని పవన్ అన్నారు. వీరు సాధించిన విజయం చూసి దివ్యాంగులెవరూ తమకున్న వైకల్యం పట్ల బాధపడకుండా చేశారు. దివ్యాంగులకే కాదు ప్రతి ఒక్కరికీ వీరి విజయం స్ఫూర్తినిస్తోంది. అకుంఠిత దీక్షతో ఒక పెద్ద విజయం సాధిస్తే దాని వెనుక పేరు ప్రతిష్టలు వాటంతటవే వస్తాయి. ఈ విజయం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.   వవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసులో సన్మానం చేయడం, ఆర్థిక సాయం చేయడంపై  క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు.