Amaravati capital of AP from 2014: ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా గుర్తించాలనే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. 2014 నుంచి 2024 వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉపయోగించిన విషయాన్ని స్పష్టం చేస్తూ, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించిన తర్వాత, ఈ బిల్లు వింటర్ సెషన్‌లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.
పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్.. ఆ తర్వాత నుంచి రాజధానిగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, 2014 ప్రకారం, హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు (2014-2024) రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా గుర్తించారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాజధాని ఏమీ పేర్కొనలేదు. దీంతో 2024 తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో చట్టపరమైన గందరగోళం తీవ్రమైంది. మునుపటి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్, కర్నూలు జుడిషియల్, అమరావతి లెజిస్లేటివ్ ప్రతిపాదించినప్పటికీ ముందుకు కదలలేదు. చట్టపరమైన ఆటంకాలు వచ్చాయి. సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుండగా, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అమరావతినే ఏకైక రాజధానిగా డివలప్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది.
కేంద్ర న్యాయశాఖలో బిల్లు ఆమోదం
ఏపీ క్యాబినెట్ మే 19, 2025న అమరావతిని రాజధానిగా గుర్తించే రెజల్యూషన్ ఆమోదించి, కేంద్రానికి పంపింది. ఈ రెజల్యూషన్‌లో 2014-2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న విషయాన్ని పేర్కొంటూ, 2024 తర్వాత అమరావతిని ఏకైక క్యాపిటల్‌గా చట్ట చేయానలని కోరుతున్నారు. కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. కేంద్రం 2014 చట్టం సెక్షన్ 5(2)ను సవరించే బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ బిల్లు అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా గుర్తిస్తూ, భవిష్యత్ ప్రభుత్వాలు రాజధాని మార్చకుండా రక్షణ ఇస్తుంది. అయితే, రెట్రోస్పెక్టివ్‌గా 2014 నుంచే అమరావతిని గుర్తించాలా లేక 2024 నుంచా అనే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆలస్యమవుతోంది. యూనియన్ లా మినిస్ట్రీ డ్రాఫ్ట్ బిల్లుపై కొన్ని ప్రశ్నలు లేవ ని, సరైన లీగల్ జస్టిఫికేషన్‌తో మళ్లీ సమర్పించమని చెప్పింది.
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం
నవంబర్ 22, 2025న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోం మంత్రి అమిత్ షాతో చర్చించారు. డ్రాఫ్ట్ బిల్లు యూనియన్ లా డిపార్ట్‌మెంట్ పరిశీలనలో ఉంది. ఈ బిల్లు యూనియన్ క్యాబినెట్ ముందుకు రానుందని, తదుపరి పార్లమెంట్ సెషన్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రి వర్గంలో బిల్లు చర్చించిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని అధికారుల అంచనా.